మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు శ్రీమతి పద్మావతి, ఆర్ టీ సీ మాజీ ఉద్యోగి గడగమ్మ నాగేశ్వరరావు - దమయంతి దంపతులు సంయుక్తంగా వారి వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం శ్రీ శ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ప్రముఖుల సమక్షంలో విగ్రహావిష్కరణ
గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. గాంధీ మందిరం, స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం సభ్యులు, రచయితలు, కవులు, శ్రీ శ్రీ అభిమానులు పెద్దసంఖ్యలో కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తెలుగువారికి పరిచయం అవసరంలేని బహుముఖ ప్రజ్ఞాశాలి, మహాకవి శ్రీ శ్రీ 1910 ఏప్రిల్ 30 న విశాఖపట్నం లో జన్మించిన ఆయన చెన్నై నగరంలో నివాసం ఏర్పాటు చేసుకొని సినీరంగంలో గేయ రచయితగానే గాక విభిన్న రంగాల్లో సేవలందించారు.
గురజాడ అప్పారావు రచనలలోని వాడుక భాష స్పూర్తితో ఛందోబద్ధమైన పద్యరచన పై ధిక్కార స్వరం వినిపించి అగ్గిపుల్ల, సుబ్బు బిల్ల కూడా కవితా పదాలని పేర్కొన్న భాషా సంస్కరణవాది. యువత కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఆయన రాసిన మహాప్రస్థానం నాడు, నేడు, ఏనాడు ప్రశంసలందుకోవడమే కాదు, ఆచరణీయమైన రచనగా పేర్కొనవచ్చు.
అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షునిగా, విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపకునిగా అనేక బాధ్యతలను నిర్వహించిన శ్రీ శ్రీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, జాతీయ చలనచిత్ర పురస్కారాలు స్వీకరించారు. హైదరాబాద్ , విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇప్పటికే శ్రీ శ్రీ కి విగ్రహాలు నెలకొల్పగా శ్రీకాకుళంలో కూడా ఆయన విగ్రహం ఆవిష్కరణకు నోచుకొంటుంది. తెలుగు వీర లేవరా ' వంటి జనాదరణ పొందిన విప్లవ గేయ రచయితగా, సాధారణ వాడుక భాషలో అనేక రచనలు చేసి తెలుగు లోకానికి చిర స్మరణీయుడైన శ్రీ శ్రీ 1983 జూన్ 15 న తనువు చాలించారు.
శ్రీ శ్రీ విగ్రహావిష్కరణ...: - చౌధరి రాధాకృష్ణ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి