1990 లలో నేను “తెలుగు పాటల గ్రీటింగులు” తయారు చేశాను. దీని సృష్టి చాలా గమ్మత్తుగా జరిగింది. ఫార్మసీ కంపెనీ వాళ్ళు మందుల పేర్లతో బ్రోచర్లు వేయించి డాక్టర్లకు ఇస్తుంటారు. అలా ఇచ్చే బ్రోచర్లలో పిల్లల బొమ్మలు ఉంటాయి. మా హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ కాబట్టి పిల్లలకు సంబంధించిన మందుల వివరాలు ఉంటాయి. కడుపు నొప్పితో ఏడుస్తున్న పిల్లలు, దెబ్బలు తగిలించుకుని ఏడ్చే పిల్లలు, జ్వరంతో నీరసించిపోయే పిల్లలు అంటూ రకరకాల ఆరోగ్య సమస్యలకు రకరకాల బొమ్మల్ని చిత్రీకరిస్తారు. నాకు వాటిని కత్తిరించి గ్రీటింగులు చేద్దామనిపించింది. ఎందుకంటే నా హైస్కూలు రోజుల్లో హిందూ పేపర్ లోని కలర్ బొమ్మల్ని కత్తిరించి తెల్లని డ్రాయింగ్ షీటుపై అతికించి గ్రీటింగులు తయారు చేసేదాన్ని. అలా తయారు చేసిన గ్రీటింగులకు చిన్న చిన్న కవితలు రాసే దాన్ని. అప్పట్లో కవితలని తెలియదు. రెండు లైన్లు, మూడు లైన్లు మాత్రమే రాసేదాన్ని. అప్పటి అలవాటు ఇప్పుడు గుర్తు వచ్చి చేతిని నిలవ నియ్యలేదు.
రంగుల బ్రోచర్లలో ఒక ఏడుస్తున్న పాప బొమ్మను నీట్ గా కత్తిరించాను. అలాగే టానిక్ నారింజ కాయ ఫ్లేవర్ లో ఉంటుందని చెప్పడానికి ఇచ్చిన బ్రోచర్ లో నారింజ కాయల బొమ్మల్నీ కత్తిరించాను. పిల్లల్లో కోలిక్ పెయిన్ వలన ఏడుస్తుంటారు. అది చూపించడానికి ఏడుస్తున్న పాపను చిత్రీకరించారు ఈ రెండు బొమ్మల్నీ ఒక డ్రాయింగ్ షీటు మీద అతికించాను. ఆ తర్వాత పిల్లల పాటలు ఏమున్నాయో ఆలోచిస్తే, గుర్తొచ్చింది. ఏడ్చే పాప బొమ్మకు “ఏడవకు ఏడవకు” అనే పాటనూ, నారింజ కాయల బొమ్మలకు నారింజ కాయా! నారింజ కాయా! అనే పాటల్ని రాశాను. దీనికి “తెలుగు పాటల గ్రీటింగులు” అని నామాకరణం చేశాను. అప్పట్లో లామినేషన్ తెలియదు. తరువాత ఎప్పుడో లామినేషన్ చేయించుకుకున్నాను. ఈ గ్రీటింగుల చుట్టూ డిజైన్ గమనించారా! తెలుగు వర్ణమాల లోని అక్షరాలను డిజైనుగా వేశాను. ఆ తర్వాత మా హాస్పిటల్ అలమరలో కూర్చున్నాయి. వచ్చి పోయే పేషెంట్లను ఆకట్టుకున్నాయి.
ఒక రోజు మందుల బ్రోచర్లలో రైలు బొమ్మ కనిపించింది. వెంటనె ‘చిక్ చిక్ రైలు’ పాట గురొచ్చింది. ‘రాక్సెమ్ కిడ్’ టాబ్లెట్ల బ్రోచర్ లో మామిడి కాయలు చిలక బొమ్మలు కనిపించాయి. దీన్ని కట్ చేసి ‘చిట్టి చిలకమ్మా’ పాటను రాశాను. దీనికి కూడా తెలుగు అక్షరాల్ని డిజైన్ గా వాడాను. ఇలా కూడా తెలుగును ప్రచారం చేయవచ్చనిపించింది. తెలుగు అక్షరాలు రాయడానికే కాదు, కళగా కూడా ఉపయోగపడతాయని అనుకుని తయారు చేశాను.
పూర్వపు పాటలతో గ్రీటింగులు తయరు చేశాను. అప్పట్లో పేషెంట్ల దగ్గర బాగా ప్రశంసలు లభించాయి. లామినేషన్ లేకపోవడం వలన చాలా పాడయి పోయాయి. నిన్న పాత బొమ్మల్ని చూస్తుంటే ఈ రెండూ కనిపించాయి. అప్పట్లో నేను తయారు చేసిన ‘తెలుగు పాటల గ్రీటింగుల్ని’ మీకు చూపించాలని వచ్చాను. మీ పిల్లలతో, మీ విద్యార్థులతో ఇలాంటి ప్రయోగాలు చేయించవచ్చు ప్రయత్నిస్తారా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి