బొబ్బిలి కళా ఉత్సవాల్లో తిరుమలరావుకు సత్కారం

 విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరుగుచున్న శ్రీశ్రీశ్రీ దాడితల్లి సరేపోలమ్మ తల్లి పండగ సందర్భంగా నిర్వహించిన బొబ్బిలి కళా ఉత్సవాల వేదికపై పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు ఘన సన్మానం పొందారు. బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు బేబీనాయన, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తెంటు లక్ష్మునాయుడు, స్థానిక కళాభారతి అధ్యక్షులు నంబియార్ వేణుగోపాలరావుల నేతృత్వంలో నిర్వహించిన కవిసమ్మేళనంలో తిరుమలరావు ఈ సత్కారం పొందారు. కవిసమ్మేళనం నిర్వాహకులు చింత రమణ, వ్యాఖ్యాత కిలపర్తి దాలినాయుడు, సమన్వయకర్త మీసాల చినగౌరునాయుడుల సౌజన్యంతో బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ సమావేశ మందిరంలో జరిగిన కవి సమ్మేళనంలో కవితను ఆలపించి సభాసదుల ప్రశంసలు పొందిన తిరుమలరావును అభినందిస్తూ శాలువా, ప్రశంసాపత్రం, కానుకలతో ఘనంగా సన్మానించారు. బొబ్బిలి రాజసం జాతి పౌరుషం అనే గీతాన్ని ఆలపించిన తిరుమలరావును ప్రశంసిస్తూ బొబ్బిలి పురపాలక సంఘం కమిషనర్ ఎల్.రామలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవికుమార్, ఉప ఖజానాధికారి పి.పద్మనాభం, ఆలయ సూపరింటెండెంట్ డి.అప్పారావు, ప్రకృతి వ్యవసాయం అధ్యయనకర్త విశ్రాంతవైద్యులు శంబంగి శ్రీనివాసరావు, దేశవాళి గోసంరక్షకులు మేళాపు చంద్రమౌళి, సాహితీవేత్తలు చింత అప్పలనాయుడు, మింది విజయమోహనరావు, బొంతు సూర్యనారాయణ, బౌరోతు శంకరరావు తదితరులు ఘనంగా సన్మానించారు. తిరుమలరావు తన రచనలో బొబ్బిలి యుద్ధం నేపథ్యం గూర్చి వివరిస్తూ కడు హృద్యంగా ఆలపించారు. తిరుమలరావు బొబ్బిలి కళా ఉత్సవాల్లో సన్మానం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు