సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత-205: ఆగ్రహాన ఆన పెట్టుకున్నట్లు"
****
"ఆళ్ళు రెచ్చగొట్టంగనే గీడెందుకు రెచ్చిపోవాలె అవ్వా! పడీపడనోళ్ళు పది కాదు వంద మాటలంటరు. అనంగనే నిప్పు తొక్కిన కోతిలా ఎగిరెగిరి పడ్డమేనా? అయిన గని అవ్వా! గీని ఆనుపానులు,బలీనతలు గాళ్ళకి బాగ తెల్సు. గందుకే గీ ఎత్తు ఏశిండ్రు."
"ఎవలు శెల్లె! ఎవలానుపానులు ఎవలి బలీనతలు? కూసింత సమజయ్యేటట్టు శెప్పు. ఎంత  తల్కాయ కొట్టుకున్నా ఎవలో మెదల్ల మెదలట్లే."
గాడే అవ్వా! సత్నారి.ఒకలు మాటంటే పడడు. కొస తీవ్రం మడిషి.గీ నడ్మల గాడు బాగ ఆదర్శాలు వల్లిత్తుండనే ఓ పుకారు లేశిందిలే. గా దాంతో ఓ యవ్వారానికి పెద్దమనిషిగ రమ్మని పిల్శిండ్రంట.  అస్లా యవ్వారమేందో 'తలేందో తోకేందో' తెల్సుకోవాలన్న సోయి లేకుండ గీడు ఎగేసుకుంట ఎల్లిండవ్వా.
" అవునా ఇంతకీ ఏమైంది శెల్లే! గీడేమన్న గుస్సా అయ్యి మాట తూలిండా ఏంది? అస్లే జనాలు ఎన్కటి లెక్క లేరు.గింత తేడా ఒత్తె 'ఉత్కుతా ఆరెత్తా ' అని బెదిరిత్తుండ్రు."
" గిప్పుడైతే గంత కాడికి రాలేగని అవ్వా! రేప్పొద్దుగాల  గీడు గన్క మాటమీదుండక పోతే గప్పుడుంటది.గందుకే ఏం జెయ్యాల్నో తెల్వక 'కాలు గాలిన పిల్లొతికె ఇంట్లెకి బయిటికి తిర్గుతుంటే అనుమానమొచ్చి అడ్గితే గియ్యన్ని జెప్పిండవ్వా!"
"గింతకి ఏం జెప్పిండు శెల్లే? గద్దప్ప గిన్ని ముచ్చెట్లు శెప్పవడ్తివి."
 ఓష్నీ అస్లిషయం మర్శినవ్వా! గక్కడ మైసయ్య బిడ్డని యాదయ్య కొడ్కు పేమించిండంట.ఏన్లేనోని ఇంటి పిల్ల నా కోడల్గ వొద్దు. గానికి ఏరే పొల్లని జూసి శేత్త అన్నడంట.గా మాటల్కి మన సత్నారికి మండి పేమించినోళ్ళని యిడ దీత్తవా? అని కోపంతో ఊగిపోయిండట. అయితే నేను అడ్గిన కట్నం ఇత్తేనే  పిల్లని ఇంట్లె అడుగు బెట్టనిత్త అన్నడట గా యాదయ్య. కట్నం గిట్నం అంటే కేసు బెడ్త అని సత్నారి. "ఎట్ల బెడ్తవో సూత్త. అయిన మా నడ్మల నువ్వెవడివి. ఇయ్యకుంటే గీ పెండ్లే గాదు" అని కండువా దుల్పి లేశిండంట.
 గా పొల్ల ఇంగ మా పెండ్లి గాదా ఏందని వల్ల వల్ల ఏడ్వడం జూసి గా కట్నమేదో నేనే ఇత్త తీ అని కోపంగ అన్నడంట.
అంటే శెల్లే"ఆగ్రహాన ఆన పెట్టుకున్నట్లు" ఉంది. మీ సత్నారి యవ్వారం.
"అవునవ్వా! మాటైతె ఇచ్చిండు గని గీని తాన ఏడున్నయి. ఇంట్లె నేమో పెళ్ళాంతో పోరు మొదలైంది. గీడు ఇయ్యక పోతే పొల్ల లగ్గం ఆగేటట్టుంది. "కుడ్తిల బిడ్డ ఎల్క లెక్క అయ్యింది" గీని పరిత్తితి.
 "గీని బోడి ఆదర్శాలు. గిట్ల జేత్తడా? గాని తల్లి సుత ఒక్క తీర్గ తిట్టబట్టింది.
గందుకే అంటరు శెల్లె! "ఆవేశాన మాటియ్యొద్దని- సంబురంగ ఉన్నప్పుడు రగస్యాలు శెప్పొద్దని. గవే కొంప ముంచుతయి."
 గీ సత్నారి అన్న మాట తప్పనోడు ఇంగ ఏం జేత్తడో  సూడాలే అనుకున్రు ఇద్దరూ.
గదండీ! సంగతి"ఆగ్రహాన ఆన పెట్టడం "అంటే గిదే మరి
కామెంట్‌లు