రాతిగుండెల రాక్షసులు..?: - కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
కన్య మరియ గర్భాన జన్మించి
కల్వరి గిరిపై సిలువను మోసి
రక్తబిందువులతో ప్రేమను రాసి
మరణాన్నే జయించిన 
మృత్యుంజయుడు…
మూడవ దినమున వెలుగై లేచిన
కరుణామయుడైన క్రీస్తు నేలలోనే
నేడు… "కరుణ" కరువైందెందుకు..?

బోధించింది ప్రేమ.. క్షమనే…
చూపింది దయా మార్గమే…
కానీ మనసులు రాతిగా మారినవే…
పాలు తేనెలు ప్రవహించే భూమిలోనే
రక్తనదులు ఉప్పొంగుతున్నాయే…
కరుణ కళ్లకు బదులు
కక్షల కత్తులు మెరుస్తున్నాయే...

“నిన్నువలె నీ పొరుగు 
"వారిని ప్రేమించు” అన్న నీతి 
పవిత్రగ్రంథంలో బంధింపబడి
ఆకాశంలో ఎగిరే డ్రోన్లు మిస్సైల్స్
వినిపించేది మరణ మృదంగమే...
కురిసే బాంబుల వర్షంలో
ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే
దగ్ధమయ్యేది బాలల బంగారు భవిష్యత్తే...
క్షతగాత్రుల...ఆకలి కేకలు
ఆక్రందనలు ఆకాశాన్నే చీల్చివేస్తున్నాయే...

ఏమిటీ ఈ భీకర యుద్ధం..?
ఏమిటీ ఈ నరమేధ యాగం..?
నరుడా…! ఓ నరరూప రాక్షసుడా..!
నీవెప్పుడు మేల్కొంటావు..?

బైబిల్… భగవద్గీత… ఖురాన్…
మూడు పవిత్ర గ్రంథాల సందేశమొక్కటే
శాంతి...సమానత్వం...సౌభ్రాతృత్వం
ప్రేమ.....మంచితనం...మానవత్వం...
క్షమ.....స్వేచ్ఛా...స్వాతంత్ర్యాలే...కదా

మరెందుకు ఈ రక్తపు రాజకీయాలు..?
ఇరుగుపొరుగు దేశాలపై ఏలఈ కసి కక్ష..?
ఈ రాబందులకు 
ఈ నరరూపరాక్షసులకు 
ఎవరు వేస్తారు శిలువ శిక్ష...?

ఓ కరుణామయుడా…!
మా కన్నీటి ప్రార్థన ఒక్కటే...
అగ్రరాజ్యాల అణుబాంబుల
అహంకారాన్ని అణచివెయ్
మానవత్వపు చిగుర్లు తొడిగించు…

ఈ రాక్షస జాతి రాతిగుండెల్లో
కరుణ జలధారలను పారనివ్వు...
యుద్ధానికి బలైన అమాయకుల
ఆత్మలకు శాంతిని చేకూర్చు…
ద్వేషాగ్నిని ఆర్పి ప్రేమదీపాల్ని వెలిగించు..

ఓ ప్రభువా…ఓ కరుణామయుడా..!
మరోమారు ఈ నేలపై అవతరించు
మానవత్వపు పునర్జన్మకై…
దుష్టశిక్షణ...శిష్టరక్షణ...గావించు...!



కామెంట్‌లు