అందని‌ద్రాక్ష: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 అంతులేని ఆలోచనలతో నడిచే జీవితంలో ఆశలే నడిపిస్తాయి.
బహుదూరపు ప్రయాణంలో పరిస్థితులే బాటలు చూపుతాయి.
అగమ్యగోచరమైన అవసరాల్లో
అదృష్టాలెప్పుడో కానీ తలుపు తట్టవు.
అస్థిరమైన నమ్మకాలతో అడుగులు వేస్తే అడుగడుగునా అవాంతరాలే స్వాగతం పలుకుతాయి.
శ్వాస ఆశగా మారి,అవిశ్రాంతపు ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు నిరాశలే మిగులుతాయి.
కలలు గన్న కోరికల కాగడాలే
దిక్సూచులై కనిపిస్తాయి.
కానీ,నెరవేరని‌ ఆశలు శూలాల్లా
గుచ్చుతూనే ఉంటాయి.
కారణాలేవైనా కథ కంచికి చేరే మార్గాలు దొరకవు అన్నిసార్లు.
అన్వేషణల ఊబుల్లో కూరుకుపోయి,ఫలితాల పరీక్షలెదుర్కొన్నా,అపజయాలు
ముందుకొచ్చి వెక్కిరిస్తాయి.
ఆత్మవిశ్వాసాలు సడలిపోయి,అంధకారం చుట్టుముడుతుంది.
ఎడతెగని కృషికి కూడా ఎదురీత తప్పదు.
అలసి ఆగిపోయిన మెదడుకు,
అందనంత ఎత్తులో ఆశలశిఖరం‌ దర్శనమిస్తుంది.
ఈడేరని కాంక్షల వలలో చిక్కుకొని మానవాళి మనుగడ ప్రశ్నార్థక మవుతుంది.
కామెంట్‌లు