సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -203: ఆవు నలుపైతే పాలు నలుపా?
***
"అవ్వా! ఎక్కడన్న గింత అన్నేలం ఉంటుందా? గా సిరిలచ్చిమి మాయింటికొచ్చి వల్ల వల్ల ఒక్క ఏడ్పు గాదుపో!"
 "ఎందుకు శెల్లే? ఏమైంది ?ఎందుకేడ్శింది? పాపం సిరి లచ్చిమికి గంత కట్టం ఏమొచ్చింది?మర్దులేమన్న మాయ జేశిండ్రా?అత్త మావఁ ఏమన్న అన్నరా ఏంది? గాల్లంత  మామూలు శాలూ గాళ్ళు గాదు.
"అవునవ్వా! గాళ్ళ ముచ్చెటి శెప్పుకోనే వల్ల వల్ల ఏడ్శింది.ఇంటికి పెద్ద కోడల్గ వొచ్చిన కానుంచి సూత్తున్న.మర్దులనైతే సొంత తమ్ముండ్ల లెక్క సూస్కున్నది.యారాండ్లతో సుత పెద్దరికంగ మంచిగున్నది. అత్త మావల్ని అమ్మ నాయిన లెక్క సూస్కుంటుంది. గస్మంటిది గాళ్ళంత  దీన్ని పరాయి లెక్క సూత్తుంటే బాదగాదా మరి?"
 "అవునా శెల్లే! గాళ్ళు సుత బాగనే సూత్తున్నట్టు అనిపిత్తదే.మాట మాటకీ లచ్చిమీ లచ్చిమీ  పిల్సుడు.గాళ్ళ అవస్రాలన్నీ తనే జూసుడు సూశిన్నే."
గట్ల డ్రామాలాడే దాన్నోట్లో మట్టిగొట్టాలని సూత్తుండ్రంటా! గీ నడ్మల ఉన్న ఆత్తులు పంచుతమని పెద్ద మడుసుల్ని పిల్శి ఏర్లు బోశిండ్రు.పక్కనిల్లే గదాని నన్ను  సుత పిలిత్తే  బోయిన.
 అవునా శెల్లె! మల్లెందుకు ఏడుత్తంది. వాళ్ళ మావఁ పేట్ల పేద్ద తలం ఎప్పుడు గొన్నడో తెల్వదట."
 మంచిదే గద శెల్లే! రేప్పొద్దున గది సుత  పంచుతడు గీళ్ళకే మంచిది గద.గీ రోజుల్ల గక్కడ గింతున్నదంటె ఎంత నయ్యం."
 అగ్గో గక్కన్నే వొచ్చింది శిక్కంత. గా తలం కొన్నిష్యం గీళ్ళ కాడ దాశిండ్రంట.గిప్పుడు ఆళ్ళకి తెల్వకుండ మర్దులకి పంచిండ్రని తెల్శిందట.గింతన్నేలం జేత్తరా? అని ఏడుత్తోంది."
 "అవుమల్ల.ఇంటికి పెద్దది గదా? పైంగ నోట్లె నాలుక లేనిది.మడిసి సూపులకు అంతంత మాత్రంగున్నా బంగారమస్మంటి మన్సున్నది. గాదానికి ఒక్క ముక్క శెప్తే ఏమైందంట శెల్లే?"
"అవునవ్వా! సిరి లచ్చిమి మనసు బంగారమే! వాళ్ళ నాయిన లచ్చిమి పెండ్లి కోసం  మస్తు తండ్లాడిండు. పిల్ల నల్లగుందని ,కట్నం శానా ఇత్తెనే చేస్కుంటమంటే అడ్గినంత కట్నం,అంగరంగ వైభోగంగ లగ్గం జేశిండు. నెత్తిన యిత్తులు పడి వొచ్చిన కానించి సూత్తున్న గద. ఈళ్ళందర్కి బానిస శాకిరి జేత్తనే ఉంది.
అవును శెల్లె!   అత్త మావఁ తనకు పొలం,కౌలు డబ్బలు తెల్వకుండ మర్దులకు బెడ్తున్నా  అయితేవాయె తీ అని పెద్ద మన్సు జేసుకుంది.ఒక్క నాడన్నా గట్లెందుకు తేడా జేత్తరని నిలదీసి అడగలే. గప్పుడే అడిగితే బావుండేది.ఏర్లు బోసే తాన సుత దీని తల్లిగారి ఆత్తి శానా ఉందని తక్కువ పంచినా ఏమనలేదు. 
 అవునవ్వా! గస్మంటి దాని పెద్దమన్సును సుల్కన తీసుకుని మాటొర్సకన్న  శెప్పకుండ దాశి ఆళ్ళ పేర్న రాత్తరా? గంత మంచి మడిషిని పక్కకు పెడ్తరా? గా యిష్యం తెల్శిన కానించి నిద్దర సుత పట్టట్లేదని ఏడ్సుకుంట జెప్పిందవ్వా!
మరి సిరి లచ్చిమి మొగుడేమనట్లేదా శెల్లే! ఆయన అమ్మ నాయినేగా?
అన్నడట అవ్వా!ఏర్లు బోశేటప్ఫుడే గది తరాల ఆత్తి సమానంగ పంచాలని జిద్దు జేత్తుంటే తనే మొగున్ని కాల్లేల్ల బడి ఆపింది. గిప్పుడు ఇట్ల జేసేతల్కి సిరి లచ్చిమిని ఒకటే తిట్టుడట. ఏర్లు తిరగ రాయమని పెద్దమన్సుల తానకి బోత ఎచ్చు తచ్చు లేకుండ పంచమంట.గప్పుడు గని మన యిల్వ తెలుత్తదని అన్నడట.
అవును శెల్లే! గట్ల అన్న దాంట్లో తప్పేం లేదు.మంచిగ గల్శున్న అన్నదమ్ములల్ల అమ్మ నాయినే శిచ్చు బెట్టిండ్రు. గదేదో ముందే శెప్తే వద్దందురా."ఆవు నలుపైతే పాలు నలుపా?
 అంటేందవ్వా? సమజవ్వలే?
గదే శెల్లే! ఆవు లెక్కనే మన సిరి లచ్చిమి.అది నలుపున్నా పాల లెక్క ఎంత మంచి మన్సు శెప్పు.ఇంకోలు ఇంకోలు ఊకుంటరా? నా అమ్మ నాయిన పెట్టింది ఎట్ల లెక్క సూత్తరని లొల్లి జెయ్యరా. అందరు సమానమే మరి సమానంగ పంచాలె గద! కోర్టుకు బోతే సిరి లచ్చిమోళ్ళే గెలుత్తరు. గప్పుడు అత్త మావఁ తల్కాయలు యాడ బెట్టుకుంటరో సూద్దాం."
 "అవునవ్వా! సూద్దాం. నాయం వొయిపు మనం సుత ఉందాం."
గదండీ సంగతి!  "ఆవు నలుపైతే పాలు నలుపా?"మనిషి బయిటి రూపం జూసి గాదు మనసు  సూడాలని శెప్పడానికి గీ సామెత ఉపయోగిత్తరు.
కామెంట్‌లు