సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -202: ఆకు నలిపినప్పుడే అసలు వాసన బయట పడేది
****
 "అవ్వోవ్! గా ఎన్కింటి రాధమ్మ  గా పట్నం  బోక ముందు ఎన్నెన్ని ముచ్చెట్లు జెప్పిందో నీకు సుత తెల్సుగద.ఎక్కడి ముచ్చెటి ఎక్కడ ముచ్చెటి కన్పడ్డ పతోల్లకి నా బిడ్డ అత్త మహా మంచిది. నాకు గస్మంటి యియ్యపురాలు దొరకడమే అదృట్టమని మురిశె గద!"
"అవును శెల్లె! మరి గిప్పుడు ఏమైంది?
 "గట్ల మా యియ్యపురాలు  శానా మంచిది .కనబడంగనే దగ్గరకు తీసుకుంటది, తియ్యగ పంచదారొతికె  మాట్లాడ్తదని మెచ్చుకునేది. మరి గిప్పుడు ఏమైందో ఏమో గని  గా ముచ్చెటినే ఎత్తడం లేదు.
 "ఎందుకెత్తుదవ్వా!"దూరపు కొండలు నునుపు" అని తేలిందిగా .గిప్పుడు ఆమె ముచ్చెటి అంటెనే ఉలికులికి పడుతున్నది. గామె పేరు  వింటేనే గజ్జున వొణుకుతున్నది.
 " అయ్యో గంతగనం ఉలికిపడుడేంది శెల్లే? ఆమె సుత మనిషేగా?"
 "ఓ అవ్వా! గా మనిషేలే . ఆమెదో ఎరైటీ.  రాధమ్మ సంబురంగ పట్నం ఎల్లిందా? ఇద్దరు కలిసి మంచిగ ఉండొచ్చు అనుకుంది.
మరేమైంది శెల్లె!"
మంచిగున్నట్టు ఉండుడట.తాను చేసిన తప్పును గంతలోనే గీ రాధమ్మ మీద బదనం అయ్యేటట్లు జేసుడట.గదేం కుళ్ళు కుచ్చితమో ఏమో."
గింతకీ ఏం జేసింది శెల్లే! గాల్లెవలో ఇంటికొత్తే తనకిట్టమైన పిండొంటని గీ రాధమ్మొదినెతో  చేయించుకొని రాధమ్మ కావాలన్నదని శెప్పిందట. గదేంది వొచ్చిన సుట్టపోల్లా నువ్వా? ఇప్పుడది కావాలా ?అని భలే దానివే అని రాధమ్మ మొగుడు రాధమ్మని శెడామడా తిట్టిండంట.అప్పన్నించి రాధమ్మకు  గామెతో  మాట్లాడాలన్నా,తిరగాలన్నా బయం పట్టుకుంది.
 అందుకే అంటారు శెల్లెె. "ఆకును నలిపి నప్పుడే అసలు వాసన బయట పడేది" అట్లాగే వాళ్ళ యియ్యపు రాలిని కదపడం వల్లనే గామె  చెడ్డ లచ్చణాలన్నీ బయటికొచ్చినయి.ఆమెతో  ఇంకొంత కాలం ఉంటే  రాధమ్మ ఇంకెంత అవమానాల పాలయ్యేదో... పైకి పచ్చగ కనబడంగనే నమ్మొద్దు అని అర్థం
 అయితే  కొందరు మాత్తరం తులిశి ఆకు లెక్క సుత ఉంటారు. అస్మంటి వాళ్ళని నలిపితేె / కదిపితే అన్నీ మంచి అంతా  మంచే జరుగుతుంది.
 అంటే అర్థం ఏమిటంటే ఆకు లక్షణం నలిపితే తెలుస్తుంది మనిషి లక్షణం కదిపితే తెలుస్తుంది. గట్ల గీ సామెతని రొండు రకాల్గా అర్తం చేసుకోవచ్చు. మంచోళ్ళయితే పరవా లేదు మంచి జరుగుతుంది గని గట్ల చెడ్డోళ్ళతో కలిశుంటే  గిట్లాంటి అనుభవాలు ఎదురైతయి.
గదండీ సంగతి!  "ఆకును నలిపినప్పుడే అసలు వాసన బయట పడేది" గీ న్యాయానికి రొండు వైపులా పదునే. మంచి,శెడు రొండు ఫలితాలు ఉంటాయి.
కామెంట్‌లు