తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ళ పైబడిన చరిత్ర ఉన్నది. తెలుగు బాల సాహిత్యానికి అంతకు పైబడిన చరిత్ర ఉందని చెప్పవచ్చు. పెద్దలకు సంబంధించిన సాహిత్యంలోని అన్ని ప్రక్రియలూ బాల సాహిత్యంలోనూ ఉన్నాయి. దృశ్య శ్రవణ మాధ్యమాలు ఎంతగా జన జీవితంలోకి దూసుకు వచ్చినప్పటికీ పుస్తక రూపంలోని సాహిత్యాన్ని పిల్లలు ఆదరిస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లల మదిలోకి చొచ్చుకుపోయే విధంగా వర్ణ రంజితంగా ఉండేలా కృషి చేయాలి. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. కాస్త మాటలు వచ్చిన దగ్గర్నుంచీ అమ్మమ్మా! కథ చెప్పవూ? అమ్మా కథ చెబితేనే నిద్రపోతాను అంటూ పిల్లలు ఇంట్లో గొడవ పెడుతూనే ఉంటారు. బాల సాహిత్యం వెలుబడిన తొలినాళ్లలో పిల్లలు మంచి పౌరులుగా రూపొందడానికి పంచతంత్రం వంటి నీతి కథలు వెలుపడ్డాయి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి హాస్య, వినోద, విజ్ఞానాత్మక, భక్తి, చారిత్రక కథలు రూపుదిద్దుకున్నాయి. గ్రీకు దేశానికి చెందిన ఈసప్ నీతి కథలను తొలిసారిగా బాలలకు పరిచయం చేసింది కందుకూరి వీరేశలింగం పంతులు. బాదంకాయ, వరి కంకులు, బ్రాహ్మిని -ముంగిస, పరోపకారం వంటి చిన్న చిన్న కథలను పిల్లల కోసం రాశారు. గురజాడ రాసిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించింది. చింతా దీక్షితులు 1931 లో సూరి, గిడుగు సీతాపతి, వేటూరి ప్రభాకర శాస్త్రి, చక్రపాణి, ఏటుకూరి వెంకట నర్సయ్య, గజ్జెల రామానుజులు నాయుడు, న్యాయపతి రాఘవరావు వంటి వారు బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
ప్రస్తుతం పిల్లల్ని పెంచడానికి తీరికలేదు ఏ హాస్టల్ లోనో పెరిగి పెద్దయి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. ఎవరి తోనూ కలవలేక పెళ్లిళ్ళే వద్దనుకుని పిల్లల్ని కనటమే మానేస్తున్నారు. స్వేచ్చాయుతంగా పెరుగుతూ స్వేచ్ఛకు అర్థం తెలుసుకోలేక తమ జీవితాల్ని, పిల్లల జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. చదువులు కెరీర్లంటూ జీవితానికి అర్థం తెలుసుకోలేక డబ్బు వెంట, కీర్తి వెంట పరుగులు పెడుతున్నారు. ఈ ప్రయాణం చివరికి ఎక్కడ ముగుస్తుందో చెప్పలేం.
ఒకప్పుడు మహిళకు సహనం ఎక్కువనీ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచగల సామర్థ్యం ఆమెకుందని అనుకున్నారు. కొంత కాలం క్రితం వరకూ అది నిజంగానే జరిగింది. ఉనికి గుర్తింపుల కోసం పోరాటం సల్పుతూ తమ జీవితానికే అర్థం లేకుండా చేసుకుంటున్నారు. మహిళల జీవితాల్లో ఆర్థిక భద్రత కొరకై ప్రవేశపెట్టిన ఆర్థిక స్వాతంత్ర్యం కుటుంబాన్ని వదిలి వెళ్ళేలా హింసను ప్రేరేపించేలా రూపం మార్చుకుంటున్నది. దానికి గుర్తించి మహిళలు మేల్కోని ఆ మాయలో నుంచి బయడపడాలి. “మేము ఆర్థిక స్వావలంబన కోసం ఉద్యోగాలు చేసి సంపాదిస్తే పిల్లలు పాడయిపోతారా కుటుంబ విలువలు వస్తాయా” అని మహళలు ప్రశ్నించవచ్చు. డబ్బు సంపాదించి కుటుంబానికి సహాయపడటం కన్నా పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించడం చాలా గొప్ప విషయం. కుటుంబ భద్రత కన్నా దేశ భద్రత చాలా ముఖ్యం.
పిల్లల్ని ర్యాంకుల వైపు కాకుండా మంచి తనం వైపు నడిపించాలి. ఒకనాటి తల్లులు నిరక్షరాస్యత తో పిల్లలకు చదువు చెప్పులేకపోయారు. మరి ఈనాటి తల్లులు ఆధిశ విద్యావంతులై కూడా పిల్లలకు చదువు చెప్పలేక హస్టళ్ళలో వేసి పెంచుతున్నారు. బాల్యం డబ్బులో, ఆధునికమైన వసతులతో పెరగటం కాదు మంచి మానవత్వం నీతి నిజాయితీలతో పెరగాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు చేయలేని ఈ పనిని బాలసాహితీ వేత్తలుగా మేము బుజానికేత్తుకున్నానంటే ఆతిశయోక్తి అనిపించవచ్చు కానీ ఇది నిజం.
నేను రాసిన కథలు తొలి సారిగా పుస్తక రూపం దాల్చింది. స్వీటీ మిల్కీ ఓ చిలుక తోనే. జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత, మా తమ్ముడి అక్షరాభ్యాస కార్యక్రమానికి విచ్చేసిన నవలా రచయిత శ్రీ రావూరి భరద్వాజ గారు నా బలల మినీ కవితల్ని చూసినపుడు ఒక మాట అన్నారు. “ఈ నాలుగు పాదాల చిన్ని కవితలో భావార్థం లోతుగా ఉన్నది కాబట్టి నువ్వు వీటిని సరళంగా కథలుగా మారిస్తే బాగుంటుంది.” నేను ఆ తర్వత కొన్ని మినీ కవితలను కథలుగా మార్చాను. మినీ కవిత రూపంలో ఉన్నపుడు తక్కువ మందికి అర్ధమైన భావం కథ రూపంలోనికి వచ్చాక చాలా మందికి అర్థమైంది. స్వీటీ మిల్కీ ఓ చిలుక పుస్తకంలో ఈ కథలే ఎక్కవగా ఉన్నాయి. ఇంకా చాలా మినీ కవితల్ని కథలుగా మర్చాల్సిన అవసరం ఉన్నది. మా ఇద్దరి పిల్లలు సృజన్, స్వాప్నిక్ ల ముద్దు పేర్లైన స్వీటీ మిల్కీ షేర్లనే ఈ పుస్తకానికి పెట్టాను. దీనికి పూర్వమే మా అమ్మ చేత 'టిక్ టాంబుర్ర' అనే బాలల కథల పుస్తకం వేయించాను. నా చిన్నతనంలో మా అమ్మ నాకు చెప్పిన కథలను పుస్తక రూపంలో వెలువరించాను.
ఈ కథల కన్నా ముందే గల్పికల పుస్తకం ‘పూలజడ’ ప్రింటయింది. ప్రముఖ పత్రికలలో బాలల కోసం పెట్టిన శీర్షికలకు నా పిల్లల అల్లరి, నా స్వానుభవంలో చూసిన విషయాలను రాశాను. ఇవి కూడా చాలా రాసినప్పటికి పుస్తక రూపంలోకి కొన్ని గల్పికలే చేరాయి. ‘పూలజడ, ఏనుగును పెంచుకుందాం' పుస్తకాల ద్వారా దాదాపు యాభై గల్పికలు అచ్చయ్యాయి. పత్రికల్లో అచ్చయి మా పుస్తకాల అలమరలో ఉన్న మిగతా గల్పికలు పుస్తక రూపం సంతరించుకోవడానికి ఎదురు చూస్తున్నాయి.
వీటి తర్వాత వచ్చిన ఆరోగ్య కథల పుస్తకం "డాక్టర్ చెప్పిన కథలు" వెలువడింది. మా ఆసుపత్రిలో ప్రతిరోజూ పేషెంట్లకు చెప్పే ఆరోగ్య విషయాలనే కథలుగా మార్చాను. ఆసుపత్రికి ఎప్పుడు తీసుకురావాలి, ఎలాంటి పరిస్థితి ఎమర్జెన్సీ అవుతుంది? పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి, ప్రమాదాల నివారణ ఎలా? వంటి అంశాలను కథలుగా అల్లి పేషెంట్లకు అందుబాటులో ఉంచాము. రోగికి జబ్బు పట్ల అవగాహన ఉన్నప్పుడు జబ్బు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలో వ్యాధులు వచ్చినప్పుడు చూపించే లక్షణాలను బట్టి ఎంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్లాలి అనే విషయం తెలుసుకోగలగటానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. రోజువారీ కార్యక్రమాల్లో ఏయే వస్తువుల వల్ల ప్రమాదాలు రావచ్చో కథల్లో వివరించాను. పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమీ పుస్తకం.
నేను నిచ్చెలి వెబ్ మ్యాగజైన్ లో 2020 నుండి కథలు రాస్తున్నాను. ఆ కథలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా వేశాను. ఇది చిన్నారి పొన్నారి అనే శీర్షికతో పిల్లల కోసం రాశాను. ఈ కథల్లో ఎక్కడా మానవ పాత్రధారులు లేరు. జంతువులే ప్రధాన పాత్రధారులుగా కథలు నడుస్తాయి. నేను జంతు ప్రేమిని జంతువులకు కథలు రాయడమే కాదు పాటలు, పొడుపు కథలు, వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు రాశాను. అంతేకాదు ఆయా జంతు రూపాలను మా ఇంట్లోని మరియు ఆసుపత్రిలోని వ్యర్థాలతో రూపొందించాను. చెట్ల ఆకులు, పువ్వులు, కాండాలు, కొమ్మలు, రెమ్మలు వంటి వాటితో కూడా మృగయాపురి ని వెలువరించాను. ఈ జంతు కథల సహకార పుస్తకం పేరు 'రాణీ ప్రసాద్ కథలు'.
తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూళ్ళు, తల్లిదండ్రులు టైము కు పంపకపోతే పిల్లల్ని రాళ్ళ మీద మోకాళ్లపై నిలబెట్టే వాళ్లు, క్లాసులో పిల్లల పట్ల పక్షపాతం చూపేవాళ్లు, పిల్లల్లో స్ఫూర్తి నింపకపోయినా మాటలతో హింసించే వాళ్ళ కథలతో వెలువడిన పుస్తకం "క్లాస్ రూం కథలు". ఈ విషయాలను వ్యాసాలుగా రాసి 2025 'బాల్యమా ఎక్కడ నీ చిరునామా' అన్న పుస్తకం వెలువరించాను. ఈ పుస్తకం చదివిన ప్రముఖ రచయితలు "వీటిని వ్యాసాలుగా కంటే కథలుగా రాస్తే త్వరగా ప్రజల్లోకి చేరతాయి ఆ విధంగా ఆలోచన చేయండి" అంటూ సలహా ఇచ్చారు. ఆ వ్యాసాల సంకలనం 2023 కు కథల రూపం సంతరించుకున్నది. పాఠశాలల్లోని సమస్యల్ని కథల రూపంలో పుస్తకంగా తీసుకొచ్చినట్లుగా నేను వినలేదు ఎవరైనా రాసి ఉండవచ్చు కానీ అతి తక్కువ మంది ఉండవచ్చు. అలాగే సైన్స్ కథల పుస్తకం కూడా తీసుకువచ్చాను. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రాల్లోని శాస్త్ర విషయాలను కథలుగా మలిచాను. పాఠశాల విద్యార్థులకు సైన్స్ పట్ల భయం తగ్గించడానికి, మూఢ విశ్వాసాలను తగ్గించడానికి నేనీ కథలు రాశాను. మానవ శరీరానికి వచ్చే అనారోగ్యానికి సంబంధించి అనేక వివరణలతో కథలు రాశాను. అనేక సైన్స్ విషయాల సమూహరమిది.
ఇక ప్రస్తుత పుస్తకం విషయానికి వస్తే ఇవన్నీ కూడా నిచ్చెలి వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైనవే. ఇందులో కథలన్నీ కూడా సమాచారాన్ని ఇస్తూ ఆలోచింపచేసేవి. చంద్రుడు ఒక గ్రహమనీ, పెంగ్విన్లు ఎందుకు ఎగరలేవో, యుద్ధంలో కుక్కల పాత్ర ఎంత ఉందో, హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో లాంటి విషయాలను కథలుగా మలిచి పిల్లలకు అందించాను. పిల్లలు తమంతట తామే చదువుకునేవి, పెద్దలు చదివి చెప్పేవి అని కొంతమంది బాలల కథల్ని విడదీస్తుంటారు. కానీ నా దృష్టిలో రెండూ బాలలకు సంబంధించినవే. ఏదైనా తల్లో, తండ్రో, నాయనమ్మో, తాతయ్యో చదివి పిల్లలకు చెప్పేవే. వాటిలోని అర్ధాన్ని అమ్మా నాన్నలు కానీ స్కూల్లోని టీచర్లు కానీ చదివి వివరంగా బాలలకు చెపితేనే వారికి అర్థమవుతాయి. చరిత్ర అంశాలైన మహానుభావుల జీవిత చరిత్రలైనా సైన్స్ విషయాలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చదివిన తర్వాతే పిల్లలను చేరతాయి. అంటే బాలలకు సంబంధించిన లేదా బాలల కోసం రాసిన ఏ రచన అయినా మొదట పెద్దలను చేరాల్సిందే. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలైయినా పిల్లలకు చెప్పే పాఠాలు, కథలైనా బాల సాహిత్యం కిందకే వస్తాయి. బాలల్ని చేరేవి బాలల్ని చేరాల్సినవన్నీ బాల సాహిత్యమే ఏ బాల సాహిత్యమైన పెద్దల్ని చేరాకే పిల్లల్ని చేరుతాయి. అందుకే పిల్లలకు సంబంధించినదంతా బాల సాహిత్యమే.
ఒంటె కున్న శారీరక ఆకారం చూసి ఎగతాళి చేసే స్నేహితులు, ఆకాశంలో ఎగరాలన్న పిల్ల తాబేల్ల ఆశలు చివరికి ఏమయ్యాయో, వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్ని వెల్లగొట్టిన ప్రాంతీయ రాజకీయాలూ , ఇరు మనుషుల మధ్యైనా, ఇరు కుటుంబాల మధ్యైనా, ఇరు దేశాల మధ్యైనా ఉండాల్సింది అడ్డుగోడలు కాదు వారిని కలిపేది వంతెనలని తెలియచేసే కథల్ని ఇందులో ఉంచాను. రెండున్నర సంవత్సరాలుగా నిచ్చెలి మాస పత్రికలో నేను రాస్తున్న కథలివి. ఇవన్నీ జంతు ప్రధాన పాత్రలుగా కలిగిన కథలు కొన్నిబాల బాలికలు ప్రాధాన పాత్రలుగా కలిగిన కథలు కూడా ఉన్నాయి.
ఈనాడు మనిషి ఎవరితో కలవలేకపోవడం అనే విషయాన్ని తీసుకొని కథను అల్లాను. కుటుంబ సమస్యల్ని ఎవరికీ చెప్పుకోలేక లోపల్లోపల ఉంచుకుని బాధపడి చివరికి జబ్బుల పాలవటం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలు ఈనాడు సర్వసాధారణ మవటం మనం చూస్తూనే ఉన్నాము. 90ల్లో నేను రాసిన గేయాలు, కవితల్లో పిల్లలకు ఈ సమస్యలున్నాయని, తగ్గించడానికి ప్రయత్నించాలనీ పేర్కొనటం జరిగింది. ఇప్పటికివి రాసి ముప్పయ్యేళ్ళు దాటిన సమస్య తీవ్రతరం అయింది కానీ సమాజంలో మార్పు రాలేదు. మార్పే రాకపోతే సమసి పోయేదెప్పుడు దీనిక్కూడా వీరేశలింగమో, రాజా రామ్మోహన్ రాయో పుట్టాలేమో.
మానవ జనాభా పెరిగినంత వేగంగా ఆహార ఉత్పత్తి పెరగటం లేదనే కారణంతో కుటుంబ నియంత్రణ తెర మీదకు వచ్చింది. ఉన్న ఆహారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని పిల్లలకు నేర్పించాలనే విషయంతో ఒక కథను రాశాను. విషసర్పాలైన, క్రూర జంతువులైనా పిల్లలుగా ఉన్నపుడు బాల్య చాపల్యం ఉండటం సహజమనే విషయాన్ని తెలియజేస్తూ ఒక కథను రాశాను.
భూగ్రహం మీద నేల తగ్గిపోయినట్లుగా, అడవుల విస్తీర్ణం కూడా మానవుని అత్యాశలకు తగ్గిపోతుందన్న విషయాన్ని కూడా కథగా మలిచాను. ఇందులో నేల తగ్గిపోవటమంటే జనాభా అవసరాలు పెరగటమే. నేరం, మోసం రాజ్యమేలుతున్న నేటి కాలంలో ఎవరికైనా అన్యాయం తల పెడితే చివరికి చావు తప్పదని చెబుతూ కథని రాశాను. భూమి లోపల బంగారం ఎలా తయారవుతుందో తెలియజేస్తూ ఒక కథ, సైనికుడిగా కావాలని కోరుకునే ఆదర్శ విద్యార్థి కథ, లోపాలున్న అపాయం గుర్తించకుండా పైకి కనిపించే గొప్పదనం చూసి మోసపోయే కథ ఇలా రకరకాలుగా కథలు రాశాను. ఈనాటి పెళ్లిళ్ల ప్రవాసాలను కూడా ఎలుక పెళ్లి కథలో చిత్రించాను
ఈ కథల సమాహారం పుస్తకంగా మీ ముందుకు వస్తున్నది. మీ అందరి మనసుల్ని హత్తుకుంటుందని ఆశిస్తున్నాను. కేవలం చదవటమే కాదు సమాజంలో బాలల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను
===========================================
డా.. కందేపి రాణీప్రసాద్-మేనేజింగ్ డైరెక్టర్
సృజన్ చిల్డ్రెన్ హాస్పిటల్-సిరిసిల్ల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి