ఆదర్శ మహిళ- సీతమ్మ : - చౌధరి రాధాకృష్ణ,
సీతాదేవి జన్మదినం వైశాఖ శుద్ధ నవమి సీతా నవమి సందర్భంగా.


యుగ యుగాల ఆదర్శ సంపూర్ణ  మహిళ సీతమ్మతల్లి.
రామాయణ రచన ముగింపు వేళ, ఋషి - ముని గణాలకు వాల్మీకి మహర్షి సందేశమిదే.

శ్రీరాముని జీవన ప్రయాణమే రామాయణం - మరోలా చెప్పాలంటే,
సీతమ్మతల్లి మహత్తర జీవనగాధ సీతాయాశ్చరితం  మహత్ - రెండూ సత్యాలే.
భువి నుండి జనియించి, కడకు భూమాత ఒడికి చేరిన సీతమ్మ మహనీయురాలు.

జనకునకు యజ్ఞభూమిలో లభించిన వరపుత్రి సీత...
పరిపూర్ణ మహిళగా, ఆత్మవిశ్వాస ప్రతీకగా భాసిల్లె, 

బాల్యంలోనే శివ ధనుస్సు పీఠాన్ని కదిపె, 
మహిమాన్విత బాలగా      పేరుప్రఖ్యాతులొందె,

మిథిలా నగరం నుండి రాముని సతిగా అయోధ్యకేతించె...
శ్రీరాముని పయనమే - సీతమ్మ సుదీర్ఘ యాత్రగా మారి రామాయణంగా భాసిల్లె...

శ్రీరాముడు వారించినా, అర్ధాంగిగా మీతోడే మీనీడే నంటుటూ ...
రామునితో అడవిబాట నడిచింది సీతమ్మ వనవాస వేళ....

మహర్షులకోసం రాక్షసులతో అకాల వైరం సరికాదని...
పతికి ధర్మోపదేశం గావించిన సతి జానకమ్మ....

లంకాధీశుడు తనను లంకకు గొనిపోవుచుండ, భవితనెంచి...
ఆభరణములను మూటకట్టి  జారవిడిచె, తన ఆనవాలు తెలుప...

దశకంఠుని గడ్డిపూచగ నెంచి, విభీషణుని సతి సరసను చెలిగనెంచె...
రావణుని తంత్ర, కుతంత్ర, కుయుక్తులు ముందుగానెరింగె...

రావణ సంహారానంతరం శ్రీరాముని పలుకులు నొప్పించగ, భవిత ప్రశ్నార్థకమయ్యె...
తనకు తానుగా అగ్నిపరీక్షనెంచి  దోషరహితయై, పవిత్రమూర్తిగ నేగుదించె...

లోకుల అపనిందలను విన్న శ్రీరాముడు - అడవులకు పంపె గర్భవతి సీతమ్మను నిర్దయగా...
వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వసించి - లవ, కుశలను కని పెంచి, విద్యా వంతులు గా తీర్చి దిద్దె...

శ్రీరాముని అశ్వమేధయాగ కారణమున - శ్రీరామ,లవ కుశలు కలుసుకున్న వేళ...
అవతారాన్ని ముగించాలని భావించిన జానకమ్మ, తల్లి భూమాతలో లీనమయ్యె..

ఓర్మిలో తల్లి భూమాతను మించిన తనయగా , ఆదర్శ మహిళగా, సుగుణాల రాశిగా ఖ్యాతినొందె...
పృథ్వి, సూర్య చంద్రులున్నంతవరకు నీ అమృత గాధ నిత్య స్మరణీయమమ్మ ఓ జానకమ్మ.
========================================
చౌధరి రాధాకృష్ణ, ఆధ్యాత్మిక విశ్లేషకులు, 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, 
శ్రీకాకుళం.
కామెంట్‌లు