దొంగలపట్ల భగవాన్ కరుణ: - - యామిజాల జగదీశ్
 భగవాన్ రమణ మహర్షి, ఆశ్రమవాసులు గాఢ నిద్రలో ఉండగా, అర్ధరాత్రి వేళ కొంతమంది దొంగలు ఆశ్రమంలో చొరబడ్డారు. అలికిడికి  భగవాన్ ఉలిక్కిపడి లేచారు. దొంగలను చూసి "మీకు కావలసినవి తీసుకోండి. అంతేతప్ప ఆశ్రమానికి మరే విధంగానూ నష్టం కలిగించకండి" అని బయటకు వెళ్లారు.
భగవాన్ పూర్తి దృష్టి కరుప్పన్ అనే కుక్కపైనే ఉంది.
దొంగలు ఆశ్రమం అంతటా వెతికారు కానీ వారికి ఏమీ దొరకలేదు. మొత్తం మీద, వారికి ఐదు రూపాయలు కూడా దొరకలేదు. ఇది దొంగలకు పెద్ద నిరాశ కలిగించింది.
కోపంతో ఉన్న దొంగలు, "నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెప్పు" అంటూ భగవాన్‌ను బెదిరించారు.
దానికి రమణమహర్షి "భిక్షాటన చేస్తూ బ్రతకడానికి నా దగ్గర ఏ డబ్బేముంటుంది చెప్పండి...?" అన్నారు.
ఆ మాటతో ఒక దొంగ రమణులవారి తొడపై గట్టిగా కొట్టాడు.
అప్పుడు భగవాన్ ఇలా అన్నారు
"నీకు కావాలనుకుంటే నా మరో తొడపై కూడా కొట్టవచ్చు" అన్నారు.
కానీ అదృష్టవశాత్తు, అలా ఏమీ జరగలేదు.
ఇంతలో రమణమహర్షి భక్తులలో ఒకడు కోపావేశంతో, "వీరి పని నేను పెడతాను. వీరిని ఉత్తినే విడిచిపెట్టకూడదు" అంటూ ఒక కర్ర తీసుకున్నాడు.
అయితే రమణమహర్షి అతనికి అడ్డుపడి "నువ్వలా చేయకూడదు. 
వాళ్ళు తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నారు. మనం మన ధర్మాన్ని ఉల్లంఘించకూడదు" అని హెచ్చరించారు. 
మహనీయుడైన కరుణామూర్తి రమణులవారు. ఎవరైనా ఎంత తప్పు చేసినా, మనం మన ధర్మాన్ని ఉల్లంఘించకూడదనేదే ఆయన మాట.

కామెంట్‌లు