సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల(భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 
సామెత -208: ఆడోళ్ళకి బట్టతల రాదేం అంటే -బెట్టుదలెక్కువ గనుక అన్నట్లు
****
గాడేందవ్వా! ఎంశేపు ఆడోళ్ళ మీన ఏడుత్తడట. నవ్వాల్నో ఏడ్వాల్నో తెల్వట్లే గాని ముచ్చటి ఇంటుంటే 'ఈ శెంప ఆ శెంప ఆయిత్తే సరే' అనిపిచ్చింది.
 'ఎవడే  శెల్లే ఆడు?ఆడోళ్ళ మీన ఏడ్శేది. అయితే వాయె తీ!  గాడికే 'ఏడ్శేడ్శి ఎడ్మ కన్ను కుళ్ళి కుళ్ళి కుడికన్ను పోద్ది' గప్పుడు గాని బుద్ధి రాదు.
గానికి ఆడోళ్ళంటే పరాష్కంగ ఉందవ్వా! గందుకే ఎక్కిరి తిక్కిరి మాటలు మాట్లాడుతుండు. బుద్ధి గల్లోడైతే 'అమ్మ మీద ఆలి మీద'  జోకులేత్తడా?
 "ఏం జోకులేశిండు శెల్లే? గట్లేత్తుంటే గాని అమ్మ, పెళ్ళాం ఊకుండ్రా? శీపిరికట్ట తిరిగెయ్యక పోయిండ్రు.
"అవ్వా! గాని పెళ్ళాం తానకెళ్ళి "నువ్వు నేను ఒక్క తీర్గనే తల్కాయకి  ఏడేడి నూనె మర్దన జేసి రాస్కుంటున్నం. నా తల్కాయ పల్సబడుతున్నది. నీ తల్కాయ శిక్కబడ్తున్నది" అన్నడంట."
ఇంటుంటెనే నవ్వాగట్లే శెల్లే! గానికి పెద్ద యిశారమే వొచ్చింది.ఇంతకీ గా పొల్ల ఏమంది?
 పాపం గా పొల్లకి ఏం అంతుబట్లేదట. ఏం మాట్లాడితే ఏం తొప్పె తోస్కొత్తదో నని,అత్తనడుగు అందంట.
 మంచి ఉషారుగల్లదే పొల్ల. మంచిగనే తప్పిచ్చుకుంది. గింతకీ అమ్మని అడిగిండా! శెల్లే!
 'అడిగిండట అవ్వా! నాల్గు దుల్పి గిస్మంటి యిష్యాలు అవుసరమారా? ఆడోళ్ళు మాట వడరు పౌర్షం ఎక్వరా అయ్యా!పట్టుదల సుత శానుంటది.గందుకే గాళ్ళకి తల్కాయలు తెల్లవడుడే గని ఊడుడు వుండదు." అందంట.
గప్పుడు గాడు "నిజవేఁ అవ్వా! కన్పిచ్చిన ఆడోళ్ళని,మొగోళ్ళని సూత్తున్ననే.ఎక్కడ జూశినా మొగోళ్ళయే బట్టతల్కాయలు అగుపిత్తున్నయి గని ఆడోళ్ళయి అగుపియ్యలే అన్నడంట.
 "గంతటితో  ఆగక  అవ్వా! "ఇంట్లోళ్ళ కోసరం యిశారిచ్చి ఇశారిచ్చి మొగోళ్ళ తల్కాయల మీద ఉన్న జుట్టు ఊడి గట్ల బట్టతలలొత్తున్నయేమో "అన్నడంట."
"మొత్తానికి బాయి దొవ్వి సూదిని దొరికిచ్చు కున్నట్టుంది గాని యవ్వారం. "ఆడోళ్ళకి బట్టతల రాదేం అంటే బెట్టుదల ఎక్కువ గనుక అన్నట్టుంది శెల్లే!"
"అవునవ్వా! మొగోళ్ళు పనికి రాని యిశారాలు చేత్తరు గనుక ఎంట్రికలు పట్ట పట్ట రాలిపోతన్నయి గదవ్వా?
 " నిజమే శెల్లే! మనం జేసే పని ఏదైనా ఎన్కముందు యిశారిచ్చి చేత్తం.అందులో ఢోకా ఉండదు.ఇంగ మొగోళ్ళది ఒంటెద్దు పోబడి. గందుకే గాళ్ళ తల్కాయలు ఎడార్లయితయి.ఒక్క ఎంట్రుక మొక్క మొల్వదు.నవ్వుకుంట అనుకుంటుంటే...
అక్కడే ఉన్న బుడ్డోడు అవ్వా! ఎడార్ల సుత బెమ్మ జెముడు,నాగ జెముడు మొక్కలు మొలుత్తయని మా సారు చెప్పిండ్రు" అన్న  మాటల్కి మరింత నవ్వుకుంట...
అవున్లేరా బుడ్డోడా! గందుకే కొందర్కి అక్కడక్కడ కన్పిత్తయి గని గయి లెక్కల్కి రావు లేరా.
"గదండీ సంగతి "ఆడోళ్ళకి బట్టతల రాదేం అంటే బెట్టుదలెక్కువ గనుక అన్నట్టు"అంటే గిదే మరి.
కామెంట్‌లు