కవి రూపవిలాసం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
కవి పువ్వైనపుడు—
పరిమళం పంచే పదాలవుతాడు,
స్పందించిన హృదయాలను 
భావసుగంధంతో నింపుతాడు॥

కవి పక్షైనపుడు—
ఆకాశగర్భంలో ఆలోచనలను విహరింపజేస్తాడు,
సరిహద్దులు లేని స్వేచ్ఛగా
కల్పనల రెక్కలు విప్పిస్తాడు॥

కవి ఆకాశమైనపుడు—
అపారతలో అంతరంగాలను విస్తరిస్తాడు,
తనలోనే జగత్తుని దాచుకొని
అనంత భావాలను ఆస్వాదింపజేస్తాడు॥

కవి వానచినుకైనపుడు—
ఎండిన హృదయాలకు జీవరసమందిస్తాడు,
నిశ్శబ్దంగా జారే కరుణగా
మనసులను మృదువుగా తడిపేస్తాడు॥

కవి ఇంద్రధనస్సైనపుడు—

రంగుల భావాల వెలుగుల వర్షం కురిపిస్తాడు,
విభేదాల మధ్య వంతెనగా
సౌహార్దాన్ని చిత్రిస్తాడు॥

కవి వెలుగైనపుడు—
అజ్ఞానాంధకారాన్ని తొలగించే దీప్తిగా మారుతాడు,
తనలోని జ్ఞానజ్యోతి వెలిగించి
లోకానికి దారి చూపుతాడు॥

కవి సుగంధమైనపుడు—
అనుభూతుల ఆత్మీయతగా వ్యాపింపజేస్తాడు,
అపార ప్రేమగా పరివ్యాప్తమై
ప్రపంచాన్ని పరిమళింపజేస్తాడు॥

కవి ఈ అన్నింటి సమ్మేళనం—
ప్రకృతికి ప్రతిబింబం, పరమార్థానికి ప్రతిధ్వని;
రూపం మారినా సారం మారదు—
అది కవిత్వం… అది కారుణ్యం… అది కవితాత్మకం॥


కామెంట్‌లు