సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -211: ఆపదలూ- సంపదలూ ఒక్కటిగా రావు
  ****
ఏందో అవ్వా ! ఇది లీల బలే ఇచ్ఛింత్రంగా ఉంటది. ఎప్పుడు ఎవలికేం జరుగుద్దో  తెల్వదు. 'ఆన రాకడ పానం పోకడ తెల్వదు'.'ఓడలు బండ్లయ్యేది బండ్లు ఓడలయ్యేదీ తెల్వదు' గదవ్వా!"
ఔను శెల్లే! ఒక్కో పాలి ఏవొచ్చినా వర్ద వొతికెనే వత్తయి. మల్ల ఆటెంక సూస్కుంటే గవీటి  గురుతులు వేదిత్తూనో సంబురపడేట్టుగనో ఉంటయ్.
 "అవునవ్వా! లేకపోతే గా ఎనికింటి ఈదమ్మకి గన్ని ఆపదలు ఒక్కపాలె ముస్రుకుంటయా? గుట్టుగ బతికే సంసారం బజార్న పడె. ఎన్ని త్యేపల గాళ్ళు బండిమీన పేటకి బోలె. గీపాలి పోడం గాళ్ళ పానం మీదకొచ్చె.టక్కరై కాళ్ళిరిగిన మొగుడు,సంటి పొల్లగాండ్లను ఎట్ల సాకాల్నో తెల్వక  రంది పడ్తున్న గా మడిషికి ఎట్లని దైర్నం జెప్తం. ఏమని ఊకిత్తం అవ్వా!"
"అవును శెల్లె! ఒక్కపాలి వొచ్చిన కట్టం అట్టనే బత్కంత ఏడిపిత్తుంటే ఇంగెట్ల ఓదార్సలేత్తం.గా ఈదమ్మకొచ్చిన ఆపదలు,కట్టాలు పగోళ్ళకి సుత రావొద్దు శెల్లే."
 గా  ఈదమ్మకేమో గట్లయ్యిందా అవ్వా! ఇంగ గా యాదమ్మ అదృట్టం సూడరాదు.ఒక్కపాలె ఇద్దరు కొడ్కులకి సర్కారు ఉజ్జోగాలు వొచ్చినయి. దాని మొగుడు పంచుకున్న భూవికి రెక్కలొచ్చినయ్. కొడ్కుల సద్వుల కోసం పెట్టిన కర్సు, అప్పు మిత్తితో సుత తీరి పోయింది. ఊల్లె అందరిప్పుడు యాదమ్మోళ్ళని  బల్శినోళ్ళ పక్కన జేరిండ్రు గాళ్ళకేం తక్వ అంటుండ్రవ్వా! గిదంత సూత్తుంటే ఒక్కొక్కలి రాత ఒక్క పాలె ఎట్ల మార్తదో తెల్వదు గదా! అనిపిత్తది".
 "గిట్లనే  గా మల్లయ్య బిడ్డ శిన్నప్పుడు సుద్దమొద్దుండె.సద్వు సక్కంగ లేదు,మడిషి సూపులకి అంతంత మాత్తరం లగ్గం ఎట్లయితదని అమ్మ నాయిన రంది పడ్డరు. గస్మంటిది గిప్పుడు బట్టల మిషన్లు పెట్టి,పనోళ్ళతో కుట్టిచ్చుకుంట మస్తు ఆత్తిపరురాలు అయ్యింది. 
ఇంగ నారయ్య బిడ్డ శిన్నప్పుడు సద్వులో అందరికంటె ముందున్నది గని ఏం ఫాయిదా. డిగ్రీ సద్వి ఇల్లెల్లక,అన్నీ  సుక్కెదురై ఆపదలను గిప్పటికీ ఈత్తనే ఉంది.మల్లయ్య బిడ్డ తాన పనికి కుదిరింది.అనుకున్నవి జర్గవు.అనుకోనివి వచ్చిపడ్తయి.ఇంత బతుకులు కదా అవ్వా!"
"గదే శెల్లే!గందుకే అంటరు"ఆపదలూ, సంపదలూ ఒక్కటిగా రావు " అని. ఒత్తే ఆపదలు,ఒత్తే సంపదలూ ఊయించని యిదంగ వొత్తయి శెల్లె.
గదండీ సంగతి! "ఆపదలూ సంపదలూ ఒక్కటిగా రావు" అంటే గిదే మరి
కామెంట్‌లు