సుప్రభాత కవిత : - బృంద
గిరుల జారే జలపాతాల
సరిగమలేవో  ఎవరిచ్చిరో...
విరులు వెదజల్లే  సుగంధాల
పరిమళమేదో ఎవరిచ్చారో!

నింగిన సాగే మబ్బులను 
నీటితో నింపినదెవరో...
నేలను విరిసే పువ్వులకు 
ఇంతటి అందం ఇచ్చిందెవరో!

నీటిని తేటగా ఉంచమని 
నింగికి అద్దం చేసిందెవరో 
గుండెలో గుట్టుగా దాచుకొమ్మని 
నీటికి  బహుమతి ఇచ్చిందెవరో!

పచ్చని ప్రకృతి కాంతను 
వెచ్చగా పలకరించి 
ముచ్చట తీరగ కాంతులు 
ముద్దుగా అద్దినదెవరో!

ఎత్తున శిఖరపు లోయలలో 
మెత్తగ మొదలై  సాగుతూ 
వేగం పెంచి దూకమని 
సెలయేటికి సలహా ఇచ్చిందెవరో!

స్వచ్ఛమైన స్వేచ్ఛకు 
సజీవ తార్కాణాలే అన్నీ 
సందడిగా వసుధను  మార్చి 
పండుగ తెచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు