పిల్లలకు కళలపై ఆసక్తి కలిగించాలి- డా. కందేపి రాణీప్రసాద్

 పరుగెత్తి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్ళు త్రాగటం మేలు అని ఒక సామెత. ప్రస్తుతం అందరూ ఇలా పరుగెత్తి, పాలు త్రాగాలనే ఆరాటంలో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. పరుగెత్తే ప్రతి వారికీ కూడా పాలు దొరుకుతాయనే గ్యారంటీ ఏమి లేదు. అయినా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఫలితంగా ప్రతివారి జీవన వేగం స్పీడ్ అయింది. ఈ వేగవంతమైన మన జీవితాల్లో నుండి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలన్నీ మెల్లమెల్లగా తప్పుకుంటూ చదువులు, ర్యాంకులు, ఉద్యోగాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి. మన ఆలోచనా ధోరణి కరక్టే. చదువుల్లేకపోతే ! ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాకపోతే బ్రతకలేరు. అయితే, జీవిత ప్రధాన లక్ష్యమైన చదువుల్ని బాగా చదవడానికి కూడా కళలు అవసరమే. గంటలు గంటలు పాఠాలు చదివి అలసిపోయిన పిల్లలకు ఓ పాట, ఓ బొమ్మ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనసు ఎప్పుడైతే ఆహ్లాదంగా ఉంటుందో తిరిగి పనిచేయడానికి, ఎంత కష్టమైనా పడటానికి రెడీ అవుతుంది. శక్తి హరించుకుపోయిన బ్యాటరీ రీఛార్జీ కాలంటే పవర్ సప్లై ఇచ్చి మరల పని చేసేలా చేస్తాం. అలాగే అలసిపోయిన మనసు రీఛార్జీ కావాలంటే, మెదడు తిరిగి శక్తివంతంగా పని చేయాలంటే కళలు తప్పనిసరి. సాధారణంగా కళల పట్ల మన అభిప్రాయం ఏమిటంటే – ‘కళల్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయము, ధనం వెచ్చించాలి. ఆ తరువాత అవి బ్రతుకు దెరువుకు ఉపయోగపడవు. అన్నింటి కన్నా ముఖ్యమైనది వారంటి మీద దృష్టి పడితే చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది.’’ కానీ ఈ అభిప్రాయం పరికాదు. కళలను అభ్యసించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉదాహరణకు చిత్ర లేఖనాన్ని తీసుకుందాం. ఏదైనా 'ఒక బొమ్మ వెయ్యాలంటే దాని ఆకారం పరిశీలించాలి. అవి సహజంగా ఏ రంగులో ఉన్నాయో గమనించాలి. ఒక గీత గీయడం మొదలుపెడితే  అది చివరి వరకు అదే స్థాయిలో సాగాలి. ఎక్కడ వణకగూడదు. అంటే ఒక బొమ్మ వేయాలంటే, ఎంత పరిశీలన, ఏకాగ్రత అవసరమో ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించరు. కాబట్టే, పూర్వపు చదువుల్లో భాగంగా సంగీతం, చిత్రలేఖనం, ఎంబ్రియిడరీ వంటివి ఉండేవి. ఈనాడు మనం వాటిని అనవసరం అని భావించి తీసేస్తున్నాం. కానీ పిల్లలకు చిన్నతనం నుంచే ఏదో ఒక కళను నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటే చాలా మంచిది. ప్రావీణ్యం అవసరం లేదు. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రావీణ్యం పొందుతారు. రోటీన్‌గా రోజూ చేసే పనులలోను, ఉద్యోగ బాధ్యతలలోను అలసిపోయినపుడు ఆ కళ స్వాంతన కలిగిస్తుంది. అలసిన మనసును సేద దీరుస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో కళల పట్ల ఆసక్తిని కలిగించండి. ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహానందించండి. అప్పుడప్పుడు వారికి పోటీలు పెట్టి వారిలోని ప్రతిభకు పదును పెట్టుకునేందుకు, మెరుగు పరుచుకునేందుకు తోడ్పడండి. 
ముగ్గులు వేయడం కూడా కళే. చుక్కల్ని క్రమ పద్ధతిలో పెట్టి వాటిని కలుపుతూ అనుకున్న ఆకారం తీసురు రావడం, ఆ తర్వాత రంగుల్ని మేళవించి కనువిందు చేసేలా తిర్చిదిద్దడం - ఇదంతా కూడా చిత్రలేఖనంలో ఓ భాగమే. ముగ్గులు వేయడం అనేది చిత్రలేఖవానికి నాంది. ముగ్గులు వేయడం వచ్చిన వారికి బొమ్మలు వేయడం సులభంగా వస్తుంది. అందుకని ఓల్డ్ ఫ్యాషన్ అని కొట్టి పారేయక, పిల్లలకు మన సంస్కృతిలో భాగమైన రంగవల్లికలను నేర్పించండి. కానీ ఈ రోజు అపార్ట్‌మెంట్ కల్చర్'ల వలన ప్లాస్టిక్ స్టిక్కర్ ముగ్గులు వచ్చేశాయి. ప్లాస్టిక్ మన జీవితాల్లో ఎంత బాగా చొచ్చుకుపోయిందంటే ప్లాస్టిక్ పువ్వులే కాదు, ప్లాస్టిక్ నవ్వులు కూడా వచ్చేశాయి. కాబట్టి కృత్రిమత్వం నుండి సహజత్వం వైపుకు పిల్లల్నీమళ్ళించాలి.
కామెంట్‌లు