మాటలను మోసుకెళ్తున్న గాలి గొంతు నులిమి మేఘం కురుస్తుంది.
కురూపి శిల్పానికి కిరీటం తొడిగి ఆవిరి నిరురూపం దాల్చింది.
దుఃఖం ముఖం ఆకాశమంతైంది
ఎండ కంఠం తెగి రక్తం కారుస్తుంది
గోధూలి మందకు గంధం పూస్తుంది
ముచ్చమటలు పట్టిన పెదాలపై ముత్యాలు మెరుస్తున్నవి.
అచ్చం మనలాంటి రూపం అద్దంలో తప్ప జీవనదిలో పొందలేం.
రాలుస్తూ పోతున్న ఆకుల్ని పోగేసి స్మశానం నిర్మిస్తున్న అడవి.
విరిగిపడ్డ అక్షరాలని దిద్ది గద్దెనెక్కిన బలపం.
అరుపుల్ని కలిపి మౌనాన్ని దులిపి ధూపం వేసి నైవేద్యం పెట్టిన పూజారి.
రెక్కలు విరిగిన పుస్తకం ఎగురలేదు కానీ నడక నేర్చుకుంది.
గమ్యం కోసం రహదారి నిర్మాణంలో ఉంది.
పక్షి ఎప్పుడో ఎగిరింది ప్రయాణం గమ్యం గందరగోళంలో ఉంది.
ప్రభువు కాదు ఆకుల చప్పుళ్ళు వినాలంటే ఋతువులు మారాలి.
గంభీరమైన శబ్దం ఎండిన చర్మాన్ని బాదితేనే పుడుతుంది.
మండిన గుండెను నీటితో చల్లారిస్తేనే స్వరం పుడుతుంది.
రంగుల్ని కలుపుతూ గీస్తున్న చిత్రం- జ్ఞాపకం ఒకటే
వెండి పూలల్లో వర్ణం కోసం స్వర్ణం కరిగింది.
నరకాన్ని స్వర్గంగా మారుస్తానని వాగ్దానం చేసిన సురాపానం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి