ధరమ్ వీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ 370వ జయంతోత్సవం...: చౌధరి రాధాకృష్ణ,


 తొమ్మిదేండ్లే పాలన, 31 వయస్సులో చిత్రహింసలకు గురి - హత్యఛత్రపతి శివాజీపై ప్రతీకారం కొడుకు శంభాజీ మహారాజ్ పై పైశాచికంగా తీర్చుకున్న ఔరంగజేబుశంభాజీ మహారాజ్ సన్నిహితులే ఆయన రహస్య స్థావరం వివరాలను ఔరంగజేబు సేనలకు చేరవేసిన వైనం...భీమా నది ఒడ్డున తులాపూర్ సమీపంలో శంభాజీ మహారాజ్ కు చిత్రహింసలకు గురిచేసి మెడ నరికి చంపి, శరీరాన్ని ముక్కలు చేసి నదిలో విసిరి వేయించిన  ఔరంగజేబు
మరాఠా సామ్రాజ్యం స్థాపించి మొఘల్ చక్రవర్తికి ప్రక్కలో బల్లమై ఛత్రపతి బిరుదుతో శివాజీ మహారాజ్ ప్రజారంజకంగా పాలించి భారతమాత ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహావీరునిగా ఖ్యాతి చెంది 1680 లో తనువు చాలించారు. 
శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు, యుద్ధతంత్రంలో ఆరితేరిన శంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్టించి తొమ్మిదేళ్ళ పాటు మొఘల్ రాజులతో నిరంతరం పోరాడి విజయ దుందుభి మ్రోగించిన యోధుడు.
1657 మే 14 న పూణే లోని పురంధర్ కోటలో ఛత్రపతి శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించిన శంభాజీ యుద్ధ విద్యలు తో పాటు సంస్కృతం, హిందీ, మరాఠా, పర్షియన్ భాషలలో పాండిత్యం పొంది పుస్తక రచనచేసి  రచయితగా కూడా పేరుగాంచారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఈయన అమ్మమ్మ జీజాబాయి  మార్గదర్శకత్వంలో పెరిగాడు. చిన్నతనంలోనే శత్రురాజులైన మొఘలుల కంటపడకుండా మధురలోని బావమరిది మరోపంత్ పేష్వా ఇంట కొంతకాలం శంభాజీని ఉంచాడు శివాజీ మహారాజ్. యేసుబాయి భోంస్లేని వివాహమాడిన శంభాజీ పాలన కంటే యుధ్ధాలతో ఎక్కువ సమయం గడపవలసి వచ్చింది. ఛావా (సింహం పిల్ల) గా ప్రజలు పిలుచుకొనే శంభాజీ మహారాజ్ యుద్ధ భూమిలో సింహంలాగే పోరాడేవారు.  
బీజాపూర్, గోల్కొండ దుర్గాలను జయించి అపార సంపద, సైన్యం చేజిక్కించుకున్న ఔరంగజేబు చిరకాల శత్రువు శంభాజీ మహారాజ్ పై దృష్టి పెట్టాడు. విపరీతంగా పెరిగిన ఔరంగజేబు సైన్యంతో వీరోచితంగా పోరాడిన శంభాజీ భటులు వెనుదిరగక తప్పలేదు. శంభాజీ మహారాజ్ కొద్దిపాటి అంగారక్షకులతో సంగమేశ్వర దేవాలయంలో తలదాచుకున్న సమయంలో ఈ రహస్య సమాచారాన్ని ఔరంగజేబు సేనాని ముఖరబ్ ఖాన్ కు చేరవేయడంతో ఆయన సైన్యం శంభాజీ మహారాజ్ ను బంధించి ఔరంగజేబుకు అప్పగించారు. మరాఠా కోటలు , ధనరాశులు అందజేసి మహమ్మదీయ మతాన్ని స్వీకరించినచో ప్రాణాలతో విడిచిపెడతానని ఔరంగజేబు పెట్టిన షరతులకు శంభాజీ మహారాజ్ తిరస్కరించడంతో..
 భీమా నదీ తీరాన తులాపూర్ లో  ఔరంగజేబు మరాఠా మహారాజ్ శంభాజీని చిత్రహింసలకు గురిచేసి 1689 మార్చి 11న శిరఛ్ఛేదం చేసి, శరీరాన్ని ఖండఖండాలగా ఖండించి భీమా నదిలో విసిరివేసాడు. 
శంభాజీ మహారాజ్ శరీర భాగాలను ఓచోట చేర్చిన స్థానిక ప్రజలు దహన సంస్కారాలు నిర్వహించి ప్రభు భక్తిని చాటుకున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసినా ధర్మాన్ని వీడక , హిందూ ధర్మ రక్షణకు కడదాకా పోరాడి వీరమరణం పొందిన శంభాజీ మహారాజ్ ధరమ్ వీర్ గా  ఖ్యాతి గాంచాడు. భారతమాత ముద్దు బిడ్డగా ఆయన చిరస్మరణీయుడు.
===================================
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
కామెంట్‌లు