ప్రవాసం లో పద్య పరిమళం - 4 : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 “సమస్య పూరణం ” - ఛందస్సు: మత్తేభము


”అపరాహ్ణమ్మున సోముడంబరము లో హ్లాదమ్ము తోనిల్చెనే*
( మధ్యాన్హ వేళలో చందమామ అనందంగా ఉదయించాడు. ..) 
ఈ సమస్య పూరించడానికి నాకు స్ఫూర్తినిచ్చిన సన్నివేశం 1980 Feb 16 న మా ఊరు మహబూబ్ నగర్ జిల్లా పాలెం  గ్రామం లో,  ప్రపంచంలో అతి స్పష్టంగా  కనిపించిన సంపూర్ణ సూర్య గ్రహణం.
సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చి సూర్యుడికి దాదాపు పూర్తిగా కప్పేసి పగటి పూటనే చీకటిగా మారి చంద్రోదయం అయినట్లుగా వుంటుంది. చీకటి పడిందని భావించి పక్షులు వున్న పళంగా తమ గూళ్ళకి గుంపులు గుంపులుగా వెళ్లడం నేను కళ్ళారా చూసాను. ఈ అద్ధుత దృశ్యాన్ని దాదపు 56 సంవత్సరాలక క్రితం మా వూరు పాలెం గ్రామం లో నేను కళ్లారా చూసి ఆనందించిన అదృష్టం నాది. 
అప్పటికే డా.  సి.  నారాయణ రెడ్డి గారు రాసిన పాట “ పగలే వెన్నెల జగమే ఊయల. .” ఏంతో ప్రచుర్యంలో వుంది. ఈ పాట “పూజా ఫలం ” చిత్రం కోసం 1964 లో రాసిన పాట. అంటే పగటి పూట చంద్రుడు కనిపించే సన్నివేశాన్ని కవిగారు తన ఊహల్లో పాట రూపం లో రాసాక  ఓ 16 ఏళ్ల  తరువాత 1980 లో ఆది నిజంగా జరగడం ఆ మహా కవి దార్షనికత కి నిదర్శనం. 
ఆ నాటి సూర్యగ్రహణము మా ఊరు  “ పాలెం”, మహబూబ్ నగర్  జిల్లా లో ప్రస్ఫుటంగా కనబడడం వల్ల ప్రపంచ ఖగోళ శాస్త్ర వేత్తలంతా అక్కడ మకాం వేసి పెద్ద పెద్ద పరికరాలతో పరిశోధనలు చేశారు. అప్పుడు దాదాపు 15 రోజులు మావూర్లో ఇదే జాతర. 
అందుకే నాకు ఈ సూర్యగ్రహణం బాగా గుర్తు అలాగే “పగలే వెన్నెలా..” పాట  కూడా.
ఆ అనుభూతులు జ్ఞాపకాల లోంచి పుట్టిన ఈ సమస్యా పూరణం.  
మత్తేభము :
అపురూపమ్ముగు అంగుళీయకముగా నా సూర్యబింబమ్ము తో 
అపరాహ్ణమ్మున సోముడంబరము లో హ్లాదమ్ము తోనిల్చెనే
ఎపుడో జూసె సి నా రె పట్ట పగలే నేతెంచు చంద్రద్యుతిన్ 
అపుడే పుట్టెను వెన్నెలమ్మ పగలే హాయైన సంగీతమై 

1 వ పాదము: 
“అంగుళీయకము”గా నా సూర్యబింబమ్ము = సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో సూర్యుని చుట్టూ ఏర్పడే ప్రకాశవంతమైన వలయాన్ని - రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) లేదా యాన్యులర్ ఎక్లిప్స్ (Annular Solar Eclipse) అంటారు. 
అంగుళీయక (Annular Solar Eclipse) సూర్య గ్రహణం.
3 వ పాదము: 
“ సి నా రె “ = ప్రముఖ రచయిత డా. సి. నారాయణ రెడ్డి 
చంద్రద్యుతి = వెన్నెల 
“పగలే  వెన్నెల జగమే ఊయల…” ప్రముఖ సినీ గేయము రచించినది డా.  సి. నా.  రే. 
==================================================================
- మీ కెవరికైనా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గుర్తుండి వుంటే కామెంట్స్ లో మీ అనుభవాలు పంచుకోండి - ధన్యవాదములు. 
###########
కామెంట్‌లు