సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -213: *ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది
   ***
"గీ ఆశెనే లేకుంటే మడిషి బత్కినా సచ్చినోళ్ళతో సమానమేగా  ఔనా?కాదా? నువ్వే శెప్పవ్వా?"
"అవును శెల్లే!మనిషి బతుక్కి ఆశెకి విడదీయరాని బంధముంది. ఒక్కొక్కలికి ఒక్కో ఆశె సద్వుల ఆశె,సంపాయించాలనే ఆశె, వస్తువులు కొనాలనే ఆశె ...గిట్ల రకరకాల ఆశెలు మడుషులకి ఉంటాం. మంచి ఆశె ఆశెయానికి సుత దారి తీత్తుంది.
 "ఇంక శెల్లే! గీ ఆశే మడిషిని సుఖాలవైపుకు మళ్ళిచ్చింది.రకరకాల సౌలతులు కనుక్కునేల సేశింది.గిట్ల ఆశె ముచ్చెట్లు శెప్పాలంటే ఒకటా రెండా శెల్లే!"
"అవునవ్వా! ముసలోల్లనీ ,దవాఖానాల్ల గా జబ్బుల బడ్డోళ్ళనీ సూత్తుంటే  నాకు సుత గిదే అనిపిత్తది.
 మొన్నటికి మొన్న సూడ్రాదు గంత పర్వుగల్ల జానమ్మ మీననే లేనిపోని నిందలేశి అవుమానిచ్చిండ్రు. వొజ్రాల నకిలీశు పోయిందని రచ్చ రచ్చ జేసిండ్రు. గామె పేటకెల్లి గీ నడ్మల కొనుక్కుని వొచ్చిన తెల్ల రాళ్ళ నకిలీశు గిల్టుది సూపెట్టి గిదే మేం శేయిచ్చుకున్నమని, ఇంటికి ముచ్చెటికొచ్చి గింత పని జేసిందని అవుమానిచ్చిండ్రు".
ఊల్లె జానమ్మ ఎస్మంటిదో తెల్వనోళ్ళు లేరు. గస్మంటిది ఆసామోళ్ళకి దడిశి ఒక్కలు నోరెత్తలేదు. ఆడ పోలీస్లను పిలిపిచ్చిండ్రు. కొట్టిపిచ్చిండ్రు.అయిన గని జానమ్మ నోరెత్తలే.
"శెల్లే! గింతకి గా అస్లీ నక్లీశు దొర్కిందా? పాపం జానమ్మ నాకెందుకు  తెల్వదు. మన పాతూల్లెనేగా ఉండేది. నే ఆరం దినాలు ఊల్లె లేకుంటిని.గిప్పుడు గీ యిష్యం తెల్శే తల్కి మన్సు కలికలి అయ్యింది శెల్లే. గీ అనుమానం బరిచ్చ లేక ఏమన్న జేస్కుంటే ..ఎవలు బాజ్జులు శెల్లే?"
పోలీస్లు మొత్తం గాళ్లిల్లు,జానమ్మిల్లు సోదా జేసిండ్రంట.రొండు రోజులు జానమ్మని,గా ఇంటోళ్ళని ఇంట్లె నించి కదల్నీయ లేదు. శివరాకరికి పోలీసులు గా వొజ్రాల నకిలీశును దొరకబట్టిండ్రవ్వా!.
"అవునా శెల్లె! శానా శానా సంబురంగ ఉంది. గింతకీ యాడ దొరకబట్టిండ్రు.నడిపోడు పుల్లు  తాగుబోతోడు. గాడే ఆ నగదీశి తనబ్బిల దాశిండట.  గీ సంగతి తెలిత్తే పర్వుబోతుందని, బయటికి పొక్కనీయకుండ ఇంటోళ్ళు ఓ పెద్ద మడిషితో పోలీసులకు శెప్పిచ్చిండ్రంట.జానమ్మ తానికి బొయ్యి  ఏమనుకోవద్దని  దండం వెట్టుకుంట ఎల్లి బొయ్యిండ్రంట.
నిజం నిప్పసుమంటిది ఎప్పటికైన బయట బడతదన్న దైర్నమే జానమ్మని బతికిచ్చింది. గదే మాట నిన్న బొయ్యి  జానమ్మతో అంటే ఏమున్నదో తెల్సునా అవ్వా? గట్ల దొంగను జేసి అందరి ముందు నిలబెట్టినప్పుడు, అవుమానమనిపిచ్చి సచ్చిపోవాలనిపిచ్చింది గని"నా మన్సు జెప్పింది నువ్వు తప్పు జెయ్యనప్పుడు ఎందుకు సచ్చిపోతవు.సత్తే గదే నిజమనుకుంటరని.గా నిజం తెలుత్తదనే ఆశే నన్ను బతికిచ్చింది అన్నదవ్వా!"
"గదే శెల్లే! "ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది అంటే..."
"అవునవ్వా! నువ్వన్నది సుబూదిగ నిజవేఁ."
గదండీ సంగతి"ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది" అంటే గిదే మరి.

కామెంట్‌లు