సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -240: - ఆగభోగాలు అంకమ్మవి - పొలికేకలు పోలేరమ్మవి
****
"ఏందో అవ్వా! గీ వలపచ్చం. ఇద్దరూ అమ్మ నాయిన్ని , తోడబుట్టినోళ్ళని వొదిలి గీ యింట్ల అడుగు బెట్టినోళ్ళే గద. ఒగల్నొక తీరు,ఇంకోల్ని ఇంకోతీరు సూత్తె బావుంటదా నువ్వే శెప్పవ్వా! గిదంత మన్సుల బెట్టుకోకుండ ఎవలన్న ఉండలేత్తరా! "
 ఏంది శెల్లె? ఎవలి ముచ్చెటి? నువ్వొచ్చినవంటే ఎవలింట్లనో ఏదోకటి జర్గిందన్నట్టే,గింతకీ గా ఏరుతారు సూశే మన్షి ఎవలు? ఎవల్ని అట్ల సూత్తుండ్రు?"
 ముందగాల నువ్వు శెప్పవ్వా గట్ల సూడ్డం నాయమేనా? ఏందో అవ్వా బూదేవికే వలపచ్చం కన్న తల్లికే వలపచ్చం అంటరు. గిస్మంటియి సూత్తుంటే నిజవేఁ అనిపిస్తది.గట్ల సూడ్డమైతే మంచిది గాదవ్వా రేప్రేపు గదే ఎదురు దెబ్బ గొట్టడం ఖాయం. గప్పుడు ఏమనుకున్నా ఏం ఫాయిదుండదు. ఎవల్నన్న పెద్దమడుసుల్ని అడిగినా గప్పుడు సేశింది ఇప్పుడు అనుభగిత్తున్నవనే అంటరు గని అయ్యో పాపం అనైతే అనరవ్వా!"
 నువ్వన్నది సుబూదిగ నిజవేఁ శెల్లే! శాన మందిని సూత్తనే వున్నం వాల్ల పెత్తనం ఉన్నప్పుడు నచ్చినోళ్ళకి తోడి పెట్టడం, నచ్చనోళ్ళని దూరం బెట్టడం. శిన్న పోరడసుమంటిది కోపమేందో,పేమేందో పసిగడ్తుండు.గస్మంటిది గాళ్ళు పసిగట్టలేరా ఏంది?"
 కనిపించని తేడాలైతే ఎంటెంట కనిపెట్టలేరుగని,కండ్ల ముందు గా తేడాలు శేత్తుంటే ఎట్లుంటది? అయిన గని ఇంటెడు శాకిరి సేశేతందుకు శిన్న కోడలు గావాలె. సరే సేశినా ఓ మెప్పు లేదు,ఓ గొప్ప లేదు. పైంగ గదో పనా అన్నట్టు సూశే సూపు, మాటలే బెల్లం.శేతల్లో ఎవలికేం బెట్టాల్నో బెట్టుకొనుడు. గిదేందవ్వా! అమ్మలు సుత గిట్లయితుండ్రేందవ్వా?"
 "కలికాలం శెల్లే! కలికాలం.గింతకీ ఎవలో శెప్పరాదు. యిష్యాలతో ఊరిత్తన్నవ్?"
 "గదేనవ్వా! మనూల్లె ఎన్క బజార్న బాలమ్మత్త ఉంది తెల్సు గద! గా అత్త ఇద్దరు కోడండ్లని ఒక్క తీర్గ సూస్కోవడంలే. శిన్న కోడల్తో ఇంటెడు శాకిరి వంగబెట్టి శేయిత్తదట. పెద్ద కోడల్కి శిన్నమెత్తు పన్జెప్పదట.తినేకాడ తాగేకాడ , పెట్టేకాడ పేమంత తోడి తోడి పెడ్తదట.శిన్న కోడల్ని అస్సలు సైసదట. ఎంత పెద్ద కోడలైతే మాత్తరం గింత తేడా సూపాల్నా అని కండ్ల నీళ్ళు పెట్టుకుందవ్వా! ఎంత కని సయిత్తది శెప్పు.అయినగని బాలమ్మత్తది గదేం తరీక శెప్పు. గా పొల్ల మొగుడికి శెప్తే ఇంట్లె ఇక నిత్తెం ఉప్పు నిప్పేగా..."
అవును శెల్లె!  గీ ముచ్చెటి ఇంటుంటే మన పెద్దోళ్ళు శెప్పిన సామెత యాది కొత్తుంది. "ఆగభోగాలు అంకమ్మవి - పొలికేకలు పోలేరమ్మవి" అన్నట్టుంది శెల్లే!
 "అంకమ్మ తల్లి దేవతంటే బయబత్తుల్తో రకరకాల నైయేద్యాలు సేశి పెడ్తరు. అమ్మో అమ్మకి కోపమొత్తే ఎట్లని బయం పడ్తరు, బోనాలు ఎత్తుతరు,జాతర్లు శేత్తరు."
"అంకమ్మని గంత బాగ సూస్కున్నోళ్ళు పోలెరమ్మ తల్లిని గంత బాగ సూస్కోరు.గట్ల ఎక్వ తక్వ నైయేద్దాలు సుత సేశి పెట్టరు. అమ్మ తానికి బొయ్యేతప్పుడు అరుపులు కేకలే గని అంకమ్మ తల్లికి సేశినట్టు శెయ్యరు.గందుకే గిస్మంటి తేడాలు జూసి అంకమ్మ తల్లికి ఆగభోగాలు -పొలికేకలు పోలేరమ్మవి'' అంటుంటరు.గది దేవతల ముచ్చెటి గని  కోడండ్లనైనా, బిడ్డల్నైనా గిట్ల జేత్తే మాత్తరం తర్వాత్తర్వాత శానా మాటలే గాదు,తేడాలొత్తయి.పెద్ద పెద్ద లొల్లులయితయి.శేతులు కాలినంక ఆకులు పట్కుంటే ఏం ఫాయిద శెప్పు"
గదే బాల్మత్తకు శెప్తే శెవు మీద పేను బారినట్టు సుత లేదు.అనుభగిచ్చేతప్పుడు తెలుత్తది తీ!"
గదండీ సంగతి! "ఆగభోగాలు అంకమ్మవి - పొలికేకలు పోలేరమ్మవి" అంటే గిదే మరి.

కామెంట్‌లు