రాజాంతో పాటు పరిసరాలలో గల పది మండలాలకు చెందిన పదవతరగతి బాలికలకు
డా.యడ్ల నీరజారాణి గర్ల్స్ ఎస్ ఎస్ సి 2026 పురస్కారాలను ప్రదానం గావించామని స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు, లాప్రోస్కోపి సర్జన్ డా.యడ్ల నీరజారాణి తెలిపారు. గత నెల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో 550 మార్కులు పైబడి సాధించిన ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆమె తెలిపారు. డోలపేట జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.జి.ఎన్.మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రంగస్థల కళాకారులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు విచ్చేసిరి. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో విద్యార్థినుల అభ్యున్నతి ధ్యేయంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని ఇదొక మహా సంకల్పమని అన్నారు. మిక్కిలి ఆదర్శవంతమైన రీతిలో గత ఎనిమిదేళ్లుగా ఈ ప్రతిభా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రోత్సాహక పురస్కార ప్రదానాలు బాలికా విద్య మెరుగుదలకు ఎంతగానో నాంది పలుకుతుందని, ఆడపిల్లలను స్వేచ్ఛగా చదివించేందుకై తల్లిదండ్రులు ఉత్సాహపడేలా ఈ కార్యక్రమ సరళి దోహదపడుతుందని ఆయన అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సామంతుల సింహాద్రినాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకవిద్యను అందించి, సృజనాత్మకతను వెలికితీసేలా పాటుపడే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు అన్నివేళలా అన్నివిధాలా సహకారాలను అందించాలని అన్నారు. స్వర్గీయ మజ్జి దుర్గమ్మ ఆశయాలను కొనసాగిస్తూ మజ్జి దుర్గమ్మ దివ్యాశీస్సులతో రాజాం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర, జి.సిగడాం, తెర్లాం, పాలకొండ, బూర్జ, మెరకముడిదాం, బలిజిపేట మండలాలకు చెందిన 140 మంది బాలికలకు తొలుత ప్రతిభా పరీక్షలను డా.యడ్ల నీరజారాణి గర్ల్స్ ఎస్ ఎస్ సి 2026 పురస్కార కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ పరీక్షపత్రంలో గణితం ఇరవై మార్కులు, ఫిజిక్స్ పది మార్కులు, కెమిస్ట్రీ పది మార్కులు, బయాలజీ పది మార్కులు మొత్తం ఏభై మార్కులను కేటాయించారు. పరీక్షల పర్యవేక్షకులుగా నిర్వాహక కమిటీ అధ్యక్షులు విశ్రాంత ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు సామంతుల సింహాద్రినాయుడు, కార్యదర్శి రాజాం జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ వైద్యురాలు డా.యడ్ల నీరజారాణి, కార్యవర్గ సభ్యులు రాజాం కేర్ హాస్పిటల్ వైద్యులు డా.సామంతుల కిరణ్ కుమార్, సురక్ష హాస్పిటల్ జనరల్ మెడిసన్ డా.సామంతుల శరత్ కుమార్, రాజాం కేర్ హాస్పిటల్ వైద్యులు డా.సవిరిగాన సురేష్ కుమార్, ప్రముఖ వైద్యురాలు డా.ప్రతిమ, రాజాం సురక్ష హాస్పిటల్ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డా.ఎం.సౌజన్య, పిజి డాక్టర్లు అంజు అలెక్స్, బద్రి, సుమ, దివ్య, డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఈసర్ల మురళీకృష్ణలు వ్యవహరించారు. ఈ ప్రతిభా పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన వాల్తేరు పాఠశాల విద్యార్ధిని ఎస్.ఐశ్వర్యకు 25000 రూపాయల, ద్వితీయ స్థానం సాధించిన జి.సిగడాం పాఠశాల విద్యార్ధిని టి.ధనలక్ష్మికి 15000 రూపాయల, తృతీయ స్థానం సాధించిన డోలపేట పాఠశాల విద్యార్ధిని ఎల్.నీహారికకు 10000 రూపాయల నగదు పారితోషికాలతో పాటు శాలువా జ్ఞాపికలతో డా.యడ్ల నీరజారాణి గర్ల్స్ ఎస్ ఎస్ సి 2026 పురస్కారాలను ప్రదానం గావించారు. తదుపరి స్థానాల్లో నిలిచిన ఓవిపేట పాఠశాల విద్యార్థిని ఎల్.నందిని, పెరుమాళి పాఠశాల విద్యార్థిని కె.నవ్యశ్రీ, వాల్తేరు పాఠశాల విద్యార్ధిని జి.నీహారిక, డోలపేట పాఠశాల విద్యార్ధిని డి.మనీషా, పాలకొండ పాఠశాల విద్యార్థిని పి.భువనశ్రీ, రేగిడి ఆమదాలవలస పాఠశాల విద్యార్ధిని ఎం.చాందిని, రేగిడి ఆమదాలవలస పాఠశాల విద్యార్ధిని పి.రేణుకలకు ఏడుగురికి 1000 రూపాయల చొప్పున మొత్తం 7000 రూపాయల నగదు పారితోషికాలతో పాటు జ్ఞాపిక శాలువాలతో డా.నీరజారాణి పురస్కారాల ప్రదానాలు గావించారు. అలాగే ప్రత్యేక పురస్కారాలుగా డా.యడ్ల నీరజారాణి, వారికి స్పూర్తి నిచ్చిన మజ్జి దుర్గమ్మలు విద్యనభ్యసించిన పాఠశాలలను గౌరవిస్తూ సదరు పాఠశాలలైన మందరాడ, పాలకొండ, డోలపేట, ఉన్నత పాఠశాలల విద్యార్ధినులు గొర్లె సాత్విక, ఆబోతుల దీపిక, బొత్స మనీషాలకు 5000 రూపాయల నగదు పారితోషికాలతో పాటు జ్ఞాపిక శాలువాలతో డా.నీరజారాణి పురస్కారాలను ప్రదానం గావించారు. ఈ పది మండలాల్లో 590 మార్కులు పైబడిన పాలకొండ, మెరక ముడిదాం, పెదపెంకి, పాలకొండ ఉన్నత పాఠశాలల విద్యార్ధినులు గొర్లె సాత్విక, మంతిన విజయలక్ష్మి, పూసర్ల దుర్గాశిరీష, పెద్దింటి భువనశ్రీలకు 3000 రూపాయల నగదు పారితోషికాలతో పాటు శాలువా జ్ఞాపికలతో డా.నీరజారాణి పురస్కార ప్రదానాలు గావించారు. ఈరోజు పరీక్షలకు హాజరైన 140మంది బాలికలందరికీ ప్రోత్సాహక బహుమతులుగా పలు కానుకల సామగ్రిని అందజేసారు.
పరీక్ష నిర్వాహకులు, విషయనిపుణులు, న్యాయనిర్ణేతలు, బహుమతి పొందిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వైద్యులు, కార్యక్రమ నిర్వాహకుల బృందాలకు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. మందరాడ, మరువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉరిటి రవిశంకర్, దాసరి హరిబాబు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు,
లావేటి గోవిందరావు, కడగల అనంతరావు, గుడ్ల భరత్ కుమార్, టంకాల హైమవతి, ఉరిటి వాసుదేవరావు, ఉగిరి మురళీకృష్ణ, కోడ పురుషోత్తం, మూడడ్ల శ్రీనివాసరావు, జి.వెంకటరమణ, అదపాక దామోదరరావు, జి.ఆదినారాయణ, రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు కుదమ తిరుమలరావు, పెంకి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన విద్యార్ధినుల స్పూర్తి దాయక ప్రసంగాలు సభాసదుల ప్రశంసలు పొందాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి