"సీతమ్మ మాయమ్మ...": - - యామిజాల జగదీశ్

 రాముడిని తన తండ్రిగా భావిస్తూ త్యాగరాజు పాడిన కీర్తన.
త్యాగరాజు తన వాకిట్లో కూర్చొని రామనామం జపిస్తున్నారు. ఆ సమయంలో, ఒక వృద్ధ దంపతులు, ఒక సహాయకుడితో సహా మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు.
 "మేము ఉత్తరాది నుండి చాలా దూరం నడిచి దేవాలయాలను సందర్శించడానికి వచ్చాం. మేము రామేశ్వరం వెళ్ళాలి. ఇప్పుడు చీకటి పడింది. కాబట్టి, మేము ఈ ఒక్క రాత్రి మాత్రమే మీ వాకిట్లో ఉండి, ఉదయాన్నే వెళ్ళిపోతాం. దయచేసి మాకు అనుమతి ఇవ్వండి" అని వేడుకున్నారు.
త్యాగరాజు రెండు చేతులు జోడించి వారికి నమస్కరించి, వారిని ఆహ్వానించారు. 
"ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండవచ్చు. నేను భోజనం ఏర్పాటు చేస్తాను. మీరు తృప్తిగా ఇక్కడే భోజనం చేయండి," అని చెప్పి వారిని కూర్చోబెట్టారు త్యాగరాజు. 
ఆయన తన భార్యను పిలిచి, "వీళ్ళకు తాగడానికి నీళ్ళు తీసుకురా, భోజనం సిద్ధం చేయి," అని చెప్పారు. 
ఇంట్లో ఇద్దరికి సరిపడా బియ్యం లేదు. ఇప్పుడు, ఐదుగురికి భోజనం వండాలంటే ఆ బియ్యంతో ఏమి చేయాలి అని ఆయన భార్య ఆలోచించింది.
పక్కింటికి వెళ్లి బియ్యం అడిగి తీసుకురావాలనుకుంది ఆమె. వెంటనే ఆమె వచ్చిన వారికి తెలియకుండా, బియ్యం తీసుకురావడానికి ఓ పాత్రను తీసుకుని, ఎవరికీ కనపడకుండా చీరలో దాచి అక్కడి నుండి బయటకు వచ్చింది. 
అయితే ఇది గమనించిన ఆ వృద్ధుడు ఆమెను ఆపాడు. "అమ్మా, మా గురించి ఇబ్బంది పడకండి. మా దగ్గర తగినంత తేనె, జొన్నలు ఉన్నాయి. మనం రెండూ కలిపి రొట్టె చేసుకుని కలిసి తిందాం," అన్నాడు. 
అతను తన మనసును వశం చేసుకున్నట్లుగా, ఆమె ఆశ్చర్యంతో, ఒకింత సిగ్గుతో ఆ వృద్ధుడి వైపు చూసింది.
ఆ వృద్ధుడు తేనె, జొన్నలు ఉన్న ఒక చిన్న సంచిని ఆమెకు ఇచ్చాడు. ఆమె అయిష్టంగానే దాన్ని తీసుకుని రొట్టె తయారీని పూర్తి చేసింది. అందరూ భోజనం ముగించారు. 
త్యాగరాజు వారితో చాలాసేపు మాట్లాడి, కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. తన ఉదయపు పనులు ముగించుకున్న తర్వాత, త్యాగరాజు ఎప్పటిలాగే సభామండపంలో కూర్చుని రామనామ జపం చేస్తున్నాడు. ఆయన ఎదుటకు వచ్చిన ముగ్గురు అతిథులు వీడ్కోలు పలికారు. 
"మాకు ఇక్కడ బస చేయడానికి చోటు ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది" అని అంటూ ఆ ముగ్గురూ వెళ్ళిపోయారు. 
త్యాగరాజు వారిని సాగనంపడానికి వారితో పాటు ద్వారం వద్దకు వచ్చారు. ఆ ముగ్గురూ ద్వారం దాటి వీధిలో నడవడం ప్రారంభించారు. రెప్పవేయకుండా వారిని చూస్తున్న త్యాగరాజు కళ్లల్లో అకస్మాత్తుగా ఒక దివ్య దర్శనం మెరిసింది. 
ఇప్పుడు ఆ వృద్ధుడు శ్రీరాముడిగా, ఆ వృద్ధురాలు సీతగా, ఆమె సహాయకుడు హనుమంతుడిగా కనిపించారు. అది చూసి, ఆయనలో వర్ణించలేని భావోద్వేగం కలిగింది. ఆయన కళ్లు చేమ్మగిల్లాయి. త్యాగరాజు భక్తి పారవశ్యంతో విలపించారు.
ఓ రామా! దశరథ కుమారా, జానకీ మాతా, మీరు మా ఇంటికి వచ్చారు. మీరు చాలా దూరం నడిచి వచ్చామని చెప్పారు. మీ కాలు పట్టుకుని నొప్పి తీర్చడానికి బదులుగా, నేను పగలు రాత్రి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను మహాపాపిని. మా ఇంట్లో తినడానికి అన్నం కూడా లేదని తెలిసి, మీరు తల్లిదండ్రులుగా మా ఆకలి తీర్చి, ఆహారం తెచ్చారు....అంటూ అప్పుడా క్షణంలో తాను రోడ్డు మధ్యలో ఉన్నానన్న సంగతి మరిచిపోయి త్యాగరాజు విలపించారు.
అప్పుడు ఆయన తనకు తెలియకుండానే 'సీతమ్మ మాయమ్మ' కీర్తన పాడటం మొదలుపెట్టారు. ఈ 'సీతమ్మ మాయమ్మ' కీర్తన కర్ణాటక సంగీతంలో చాలా ప్రసిద్ధమైన పాట. దీనిని నేటికీ చాలా మంది పాడుతారు.
పల్లవి :
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥ 
అనుపల్లవి:
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ॥సీ॥ 
చరణం:
పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సుర పతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా.
ఈ కీర్తన సారాంశం... 
సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి: సీతాదేవి నా తల్లి, శ్రీరాముడు నా తండ్రి. వాతాత్మజ సౌమిత్రి...: వాయునందనుడు (హనుమంతుడు), సుమిత్ర పుత్రుడు (లక్ష్మణుడు), గరుత్మంతుడు, శత్రుఘ్నుడు, భరతుడు మొదలైనవారు నాకు సోదరులు.
పరమేశ వసిష్ఠ...: శివుడు, వశిష్ఠుడు, పరాశరుడు, నారదుడు, శుకుడు, ఇంద్రుడు, సనకాదులు వంటి భగవద్భక్తులందరూ నాకు అత్యంత ఆత్మీయులు (బాంధవులు). 


కామెంట్‌లు