కవితా మంజరి: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
కవితా — ఊహల ఊటవి నువ్వు,
ఎప్పుడు వస్తావో నీవు,
ఎందుకు వస్తావో నీవు,
ఎలా మాయమవుతావో నీవు॥

కవితా — సంతసానివి నువ్వు,
సంబర పరుస్తావు నీవు,
సవ్వడులు చేయిస్తావు నీవు,
చిందులు తొక్కిస్తావు నీవు॥

కవితా — చక్కదనానివి నువ్వు,
పసికందులా వస్తావు నీవు,
పడుచులా మారుతావు నీవు,
పసందు కలిగిస్తావు నీవు॥

కవితా — ప్రకాశించే పుష్పానివి నువ్వు,
పరిమళాల పవనానివి నీవు,
ప్రకృతికి ప్రతిబింబానివి నీవు,
పాఠకులకు పసందువు నీవు॥

కవితా — పున్నమి జాబిలివి నువ్వు,
తెల్లని వెలుగువు నీవు,
చల్లని వెన్నెలవి నీవు,
మెల్లని విహారివి నీవు॥

కవితా — కళ్ళకు అక్షరాలవు నువ్వు,
పెదాలకు పదాలవు నీవు,
మదులకు మత్తువి నీవు,
హృదులకు కౌగిలివి నీవు॥

కవితా — లోకానికి లావణ్యానివి నువ్వు,
అందంతో అలరిస్తావు నీవు,
అలంకారాలతో ఆకర్షిస్తావు నీవు,
ఆనందాల్లో ముంచేస్తావు నీవు॥

కవితా — సాహితీజగతిలో సుధవు నువ్వు,
నోర్లను ఊరిస్తావు నీవు,
అంతరంగాలను అంటుకుంటావు నీవు,
అనంతమైన భావాలను మేల్కొల్పుతావు నీవు॥


కామెంట్‌లు