శ్రీకాకుళం గాంధీ మందిరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహావిష్కరణ....: - చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది


 గాంధీ మందిరం, స్వాతంత్ర్య సమరయోధుల, సంఘ సంస్కర్తల, తేజోమూర్తుల స్మృతి వనంలో కొలువు తీరిన మహనీయుల చెంత నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులుగారి విగ్రహం కొలువు తీరనుంది. శ్రీకాకుళం తెలుగు రచయితుల వేదిక సభ్యులు నెలకొల్పిన కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహాన్ని  ఈనెల 27న ఆయన వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు  శ్రీకాకుళం తెలుగు రచయితుల వేదిక అధ్యక్షుడు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకట రమణమూర్తి  తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం భారత ప్రభుత్వ ఆర్థికశాఖ హిందీ సలహామండలి సభ్యులు కోనే శ్రీధర్ స్థాపించిన తమ సంస్థ వందమంది తెలుగు కవులు, రచయితలు సభ్యులుగా కొనసాగుతూ ప్రతీ నెల మొదటి ఆదివారం సాహితీ సదస్సును నిర్వహిస్తామని, జూన్ నెల తొలి ఆదివారం 117వ సాహితీ సదస్సు జరుగనుందని వీరు తెలిపారు.  కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మా పాఠకులకు అందజేస్తున్నాం.
తెలుగు ప్రజల ప్రాతఃస్మరణీయుడైన కందుకూరి వీరేశలింగం పంతులు పరిచయం అవసరంలేని నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, సాహితీవేత్త, రావు బహదూర్ బిరుదాంకితుడు.
కళలకు కాణాచియైన రాజమహేంద్రవరం లో 1848 ఏప్రిల్ 16న అగ్రవర్ణానికి చెందిన సుబ్బారాయుడు, పున్నమ్మ పుణ్య దంపతులకు జన్మించిన కందుకూరి వీరేశలింగం చిన్ననాటి నుండే ప్రతిభాపాటవాలను ప్రదర్శించేవాడు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో బంధువులు చేరదీసి రాజమహేంద్రవరం, చెన్నై వంటి ప్రదేశాల్లో ఉన్నత చదువులు చదివించారు.
బాల్యంలోనే సామాజిక పోకడలను, బాల్య వివాహాలు, బాలికా విద్య పట్ల అనాసక్తి, అంటరానితనం పేరుతో వారిని విద్యావకాశాలు లేకుండా చేయడం, వితంతు వివాహాల నిషేధం వంటి సామాజిక రుగ్మతలను నిర్భయంగా ప్రశ్నించేవాడు. అవినీతి, లంచగొండితనాలను చూస్తూ సమాజం మౌనం వహించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బాల్యంలో వేధించిన ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు వెతుక్కుంటూ సాగిన జీవన పయనమే సమాజానికి ఆయన బహూకరించిన సంస్కరణలు. 
లంచమివ్వనిదే రాదని ప్రభుత్వ ఉద్యోగాన్ని, అబద్ధాలు చెప్పించవలసి వస్తుందని న్యాయవాది వృత్తిని కాదనుకొని ప్రశాంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగిడిన కందుకూరి రాజమహేంద్రవరం లో 25 సంవత్సరాలు తెలుగు పండితునిగా, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, చెన్నైలో తెలుగు అధ్యాపకునిగా ఐదేండ్లు పనిచేసారు. 
సమకాలీన సామాజిక ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం వీరేశలింగం కు పదమూడవ ఏట ఎనిమిదేళ్ళ బాపమ్మ( రాజ్యలక్ష్మి)తో వివాహం జరిగింది. బాల్య వివాహాల దుష్పరిణామాలు ప్రత్యక్షంగా చూసి, అనుభవించిన వీరేశలింగం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి,భావసారూప్యం గల మేధావులను, యువతను కలుపుకు పోయారు. దెయ్యాలు, చేతబడులు కేవలం భ్రాంతియని ప్రజలకు  చాటిచెప్పి వారిని చైతన్యవంతులను చేసారు.
వీరేశలింగం పంతులు స్వంతంగా పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాలలో బాలబాలికలను ఒకేచోట చదువు, సంస్కారం నేర్పడమే గాక అంటరాని కులాలుగా పిలువబడే పిల్లలను కూడా వీరితోపాటు చేర్చుకుని చదువునేర్పి ఒకే చర్య ద్వారా బాలికా విద్య, సహ విద్య,  విద్యకు దూరమైన అస్పృశ్యులకు విద్య అనే మూడు సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. తొలుత ఈ చర్యను వ్యతిరేకించిన వర్గాలు ఆ తరువాత ఆమోదించారు.
బాల్య వివాహాల కారణంగా చిన్నవయసులోనే వితంతువులు జీవితాంతం వితంతువులాగానే ఉండాలనే సామాజిక కట్టుబాట్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్వ విద్యార్ధులు, మిత్రులు, సతీమణి రాజ్యలక్ష్మిల సహకారంతో వితంతు వివాహాలను ప్రోత్సహించడమే గాక తన ఇంటివద్ద 1881డిశెంబరు 11న తొలి వితంతు వివాహం జరిపించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. సమాజం నుండే గాక బంధువర్గం నుండి కూడా తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తినా, వంట చేసేవారు, బట్టలుతికేవారు సామాజిక బహిష్కరణ గాలించినా చలించని ఆయన తన లక్ష్య సాధనలో ముందుకు దూసుకుపోయారు. ఈ సమయంలో ఇంటి పనినంతా తానే చేసుకుని భర్తకు సహకరించారు రామలక్ష్మి. ఎన్నో అడ్డంకులను అధిగమించి 40 వితంతు వివాహాలను జరిపించిన సాహసికుడు వీరేశలింగం పంతులు.
ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మ సమాజ్ ను స్థాపించి హిందూ మతములో గల అనైక్యతను రూపుమాపడానికి ప్రయత్నించారు. నిరాశ , నిస్పృహలతో కొట్టిమిట్టాడుతున్న యువతను సంఘటితపరచి చైతన్యవంతులను చేసి సామాజిక రుగ్మతలపై పోరాటానికి సిద్ధం చేయడానికి యువజన సంఘాల నేర్పాటుచేసారు. 1905 లో హిత కారిణి సమాజం పేరుతో సేవాసంస్థ నెలకొల్పి తన యావదాస్తిని ఆ సంస్థకు దానం చేసిన దానశీలి కందుకూరి.
తెలుగు భాషలోనే గాక సంస్కృతం, ఆంగ్ల భాషలలో  కందుకూరి వీరేశలింగం పంతులు ప్రావీణ్యం గలవారు. బాల్యంలోనే శతకాలను రాసిన ఆయన తన జీవిత కాలంలో 130 గ్రంథాలు రచించారు. రాజశేఖర చరిత్ర పేరుతో నవల, పిల్లలకు వాచకాలు, స్వీయ చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర, సంగ్రహ వ్యాకరణం, ప్రహసనం పేరుతో హాస్య, వ్యంగ్య రచనలు చేయడమే కాకుండా పరవస్తు చిన్నయ సూరి  విష్ణుశర్మ గారి పంచతంత్ర వ్యాకరణం లో విడిచిన భాగాన్ని పూర్తి చేసారు. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో ఆయనను రావు బహదూర్ బిరుదుతో సత్కరించింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక రంగం లో ప్రతి ఏడాది కందుకూరి పురస్కారం పేరుతో నాటకరంగ ప్రముఖులను సత్కరిస్తున్నారు. వివేక వర్ధిని పత్రిక స్థాపించి లంచగొండితనం, వేశ్య వృత్తి, సమాజంలోగల దురాచారాలను తీవ్రంగా ఎండగట్టేవారు. 1919 మే 27 న తన 71వ ఏట తనువు చాలించారు. జీవితాంతం సమాజంలోని దురాచారాలపై రాజీలేని పోరాటం చేసి విజయం సాధించారు. రాజమహేంద్రవరంలో ఆయన నివాసం ప్రస్తుతం పర్యాటక శాఖ ఆధీనంలో మ్యూజియంగా రూపుదిద్దుకొని కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమానికి సాక్షీభూతంగా నిలిచింది.  ఆయన తన రచనల ద్వారా తెలుగు తల్లికి  ఎనలేని సేవ చేసారు. తెలుగు జాతికి ఆయన జీవితం ఆదర్శనీయం. అటువంటి మహనీయుని విగ్రహం ఈరోజు శ్రీకాకుళం గాంధీ మందిరం లో ఆవిష్కరించడం ఆనందదాయకం. ఆయన విగ్రహం నెలకొల్పిన శ్రీకాకుళం తెలుగు రచయితుల వేదిక సభ్యులు నిజంగా తెలుగు వీరులే...
===============================


చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం
కామెంట్‌లు