సమాజ శ్రేయస్సు, సంస్కరణలను ఆకాంక్షిస్తూ సాహిత్యలోకం పయనిస్తుందని, అదే కవుల ప్రధాన లక్ష్యమని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక 15వ నెల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా భావించి కొత్తూరు రచయితల వేదిక మిక్కిలి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత ఉర్జాన ప్రసాదరావు మాట్లాడుతూ, గత సాంప్రదాయాలను గౌరవిస్తూ, దేశ సంస్కృతి పట్ల నేటి తరాలకు ఆసక్తి పెంచేలా రచనల శైలి ఉండాలని, వర్తమాన అంశాలను గమనిస్తూ రచనలు చేయాలని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి గుత్తావిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రచయితలంతా నిరంతర పుస్తకపఠనం చేపట్టిననాడే రచించే కవితలు కథలు వ్యాసాలనందు సందేశాత్మక భావం ఏర్పడుతుందని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు సమన్వయంతో కవిసమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో కొరవే వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావుతో పాటు, అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, కార్యవర్గ సభ్యులు అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్, గేదెల మన్మధరావు, పొగిరి రవి, ఉర్జాన ప్రసాదరావు, గుత్తావిల్లి శ్రీనివాసరావు, పేరిశెట్టి రామచంద్రరావు, సల్ల మన్మధరావు, ఇప్పిలి జానకి రామయ్య, సవర తిరుపతిరావు, తదితరులు స్వీయ కవితా గానం చేసి సభాసదుల ప్రశంసలు పొందారు. అనంతరం కవులందరికీ వేదిక ఘనంగా సన్మానించింది. ఒకటో తరగతి చిన్నారి జి.లాస్యశ్రీ వినిపించిన తెలుగు అభినయగేయాలు అందరి ప్రశంసలు పొందాయి. ఈ కార్యక్రమంలో విద్యావంతులు సాహిత్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి