భారతీయ సాంస్కృతిక సంస్కర్త , భారత పునరుజ్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్: - చౌధరి రాధాకృష్ణ, శ్రీకాకుళం
 స్త్రీ విద్య - సామాజిక రుగ్మతలను రూపుమాపే దివ్యౌషధంగా భావించిన దార్శనికుడు
సతీసహగమనం దూరాచారంపై అవిశ్రాంతంగా పోరాడి బ్రిటిష్ వారిచే దీనికి వ్యతిరేకంగా చట్టం చేయించిన మహామహుడు
హిందూ సమాజంలో కులతత్వం, బహు దేవతారాధన అస్పృశ్యతకు కారణంగా భావించి ఏకేశ్వరోపాసన ప్రాతిపదికగా బ్రహ్మసమాజం స్థాపించిన మత సంస్కర్త
సామాజిక రుగ్మతలకు పరిష్కారాలు చూపి ఆచరించిన ఆదర్శవాది
విభిన్న భాషల్లో వారపత్రికలను నడిపి సామాజిక మార్పుకు కృషిచేసిన మహనీయుడు
======================================================================



పంతొమ్మిదవ దశాబ్ది తొలి మూడున్నర దశాబ్దాల కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ భారతీయ సమాజంలోని విభిన్న రంగాల్లో విప్లవాత్మక మార్పులకు విశేషంగా కృషిచేసి అనేకాంశాలలో విజయం సాధించి భారత పునరుజ్జీవన పితామహుడుగా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. బెంగాల్ లోని రాధానగర్లో 254 ఏండ్ల క్రితం  1772 మే 22 న సాంప్రదాయ సంపన్న అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన రామ్మోహన్ రాయ్ చిన్ననాడే సంస్కృత, పర్షియన్, అరబిక్, ఆంగ్ల, బెంగాలీ భాషలలో పాండిత్యం సంపాదించాడు. 1814 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీలో అనేక ఉన్నత ఉద్యోగాలు చేసి  బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సమాజాన్ని అణచివేతకు గురిచేస్తూ, కనీస పౌరహక్కులు కల్పించక, న్యాయ,  చట్టబద్ధ పాలన సాగించక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్న ఆయన భారతీయ సాంస్కృతిక, సామాజిక రుగ్మతలను కూడా అధ్యయనం చేసి భారతీయుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని భావించాడు. ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన వంటి అంశాలపై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటానికి భారతీయులు విద్యావంతులై బ్రిటిష్ పాలనా రంగంలో భాగస్వాములు కావాలని భావించాడు.
భారతీయ సమాజాభివృద్ధికి ప్రధాన శత్రువులుగా అస్పృశ్యత, మూఢ నమ్మకాలు, కులతత్వం, బహు దేవతారాధన, బాల్య వివాహాలు, బహు భార్యత్వం నుండి విముక్తి లభించాలని, ఈ దిశగా సమాజం చైతన్యవంతమై సామాజిక రుగ్మతలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ఆచారాలు, కట్టుబాట్లు, అవిద్య , అసమానతలుపై పోరాటానికి తొలిదశలో సహకరించక పోగా, వ్యతిరేకించినా మొక్కవోని ధైర్యంతో రామ్మోహన్ రాయ్ ముందుకురిమాడు. మద్దతిచ్చేవారి సహకారం తీసుకుని ప్రజలను చైతన్య పరుస్తూ నాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారం తీసుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేసాడు.
భార్య చనిపోతే పునః వివాహం చేసుకున్న పురుషుడు, భర్త చనిపోయిన సందర్భంలో మాత్రం భర్త చితి మంటల్లో భార్యను బలవంతంగా పడవేసి భారత్ మరణానికి కారణమైన సతీసహగమనం. ఈ దురాచారం మహిళల జీవించే హక్కును కాలరాస్తుందని, సమాజం చైతన్యవంతమై దీనికి  వ్యతిరేకంగా ఏకోన్ముఖంగా పోరాడాలని రామ్మోహన్ రాయ్ పిలుపునిచ్చారు ఓవైపు ప్రజా చైతన్యానికి పోరాటం చేస్తునే అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. రామ్మోహన్ రాయ్ నేతృత్వంలోని ప్రజా ఉద్యమం ఫలితంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ ఆర్టికల్  XVII ద్వారా సతీసహగమనం దూరాచారాన్ని రద్దుచేస్తూ చట్టం చేయడంతో ఓ సామాజిక రుగ్మతకు తెరపడినట్లయింది. రామ్మోహన్ రాయ్ జీవితంలో దీనిని ఒక ఘన విజయంగా భావించవచ్చు. 
బాల్య వివాహాలు అధికశాతం జరిగే నాటి సమాజంలో ఈ దురాచారం పై ఆయన ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేసారు. బహు భార్యత్వం పురుషాధిక్య సమాజాన్ని సూచించడమే గాక మహిళలకు స్వేచ్ఛ లేకుండా యాంత్రికంగా తయారుచేసిందని, దీనికి వ్యతిరేకంగా మహిళలు కూడా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రుగ్మతలను రూపుమాపాలంటే బాలికా విద్యను ప్రోత్సహించాలని సూచించారు. ఆయనే స్వయంగా భారతీయ జ్ఞానాన్ని పాశ్చాత్య శాస్త్రాలతో మేలవించి సమగ్ర  విద్యాబోధన జరగాలని 1822లో ఆంగ్లో- హిందూ పాఠశాలలను ప్రారంభించి బాలికా విద్యను ప్రోత్సహించారు. 1826 లో ఏకోశ్వరోపాసన సిధ్ధాంత ప్రాతిపదికపై వేదాంత కళాశాల ప్రారంభించారు.
రామ్మోహన్ రాయ్ తన ఆలోచనలను, సమాజంలో రావలసిన పెనుమార్పులను బహిరంగ వేదికలపై చర్చించాలని, ఈ ఉద్యమంలో సమకాలీన, భావసారూప్యం గల మేధావులను సంఘటితం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించి 1814లో కలకత్తాలో ఆత్మీయసభ పేరుతో సమావేశం నిర్వహించి సామాజిక రుగ్మతలపై యుద్ధం ప్రకటించారు.
క్రైస్తవ, మహమ్మదీయ మతాల ఏక దేవతారాధనను సమర్ధించిన ఆయన హిందూ మతములో కూడా ఏకోశ్వరోపాసనకు కృషి చేసారు. ఆచారాలు, సాంప్రదాయాల కంటే నైతిక బోధన, ఉన్నత విలువలు గల సమాజం కోసం కృషి చేయాలని, అన్ని మతాలు ఐకమత్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఆయన హేతువాదం, మానవతావాదం, ఏకోశ్వరోపాస, సమానత్వం తో కూడిన సమాజం కోసం 1828లో బ్రహ్మ సమాజ్ ను స్థాపించారు.
ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు చేరువై సామాజిక మార్పుకై ఆయన బ్రాహ్మణికల్ మేగజైన్, సంవాద్ కౌముది, మీరత్ ఉల్ అక్బర్ వంటి వారపత్రికను నడిపారు.
బహుగ్రంధ రచయితగా పేరొందిన ఆయన అనేక తాత్విక గ్రంథాలు రచించారు, వేద గ్రంథాలను అనువదించారు. సామాజిక, రాజకీయ అంశాలపై పలు వ్యాసాలు రాశారు.
 మొఘల్ చక్రవర్తి అనధికార ప్రతినిధిగా ఇంగ్లాండ్ వెళ్లి కింగ్ విలియం lV చే ఘన స్వాగతం పొందారు.1833 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్ లో బ్రిస్టల్ సమీపంలో స్టేపుల్టన్ లో అనారోగ్యంతో మరణించగా అక్కడే సమాధి చేసారు.
అక్బర్ ll నుండి రాజా బిరుదు పొంది రాజా రామ్మోహన్ రాయ్ గా భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భారతీయులకు నిత్య స్మరణీయుడు సంస్కరణాభిలాషులకు ఆదర్శనీయులు.
కామెంట్‌లు