ప్రేమించే గుణం
కేవలం మనుషులకు మాత్రమే
సొంతం కాదు...
ఈ భూమిపై ఉన్న
ప్రతి జీవికి
ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలుసు...!!!
ఉదయం
సూర్యుడు ముఖం
చూపడంతోనే
పొద్దుతిరుగుడు పువ్వులు
హాయిగా నవ్వుతాయి
చెట్ల ఆకులు
గాలితో కలిసి నాట్యం చేస్తూ ఆనందిస్తాయి
పొద్దున్నే పక్షులు
"మళ్ళీ వెలుగు వస్తోంది" అంటూ
కూనిరాగాలు తీస్తూ
మహదానందంతో
అటూ ఇటూ
ఎగురుతాయి
కానీ...
సాయంకాలం రావడంతోనే
అదే ప్రకృతి
మెల్లమెల్లగా మౌనంగా
మారుతుంది
ఆ క్షణంలో
పిచ్చుకల కిచకిచలు
గోరింకల పిలుపులు
కోకిలల ఆరాటపు స్వరం
విడిపోతున్నామనే
ఓ విరహ వేదనను
మనసులలో నాటుతాయి
ఆహారం కోసం
వెళ్ళిన తల్లి పక్షి
తిరిగొస్తోందా లేదా అని
గూటిలో నిరీక్షించే
పిల్ల పక్షులలా
సాయంకాలానికే
ఓ ప్రత్యేకమైన శోకముంది
ఓ భారముంది
ఈ పిచ్చుక కళ్లలో
ఒక శోకాన్ని చూడొచ్చు
నిశితంగా గమనిస్తే...
అందుకే అంటున్నా
ప్రకృతిలోని ప్రతి ప్రాణిలోనూ
ప్రేమించే గుణం ముందని

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి