సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

భీష్మ పర్వము తృతీయాశ్వాసము-256 వ రోజు
మూడవ అశ్వాసం
ధృతరాష్ట్రుడు ఆరవరోజు యుద్ధంలో తనకుమారులు వెనుక పడినందుకు ఖేదపడి మిగిలిన విషయాలు చెప్పమని సంజయుని కోరాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడైన సుయోధనుడు పితామహుని వద్దకు వెళ్ళి " పితామహా ! పాండవ బలం రోజురోజుకు పెరిగి పోతుంది. ఈ రోజు నేను నీముందే భీముని చేతిలో భంగపడ్డాను. ఇంతకంటే అవమానం ఏమున్నది. కుంతీ తనయులను నీ సాయంతో గెలుస్తానని అనుకున్నాను. నీవేమో పాండుసుతులను అడ్డలేక పోతున్నావు. వారికింత బలం ఎలా వచ్చింది. భీష్ముడు " సుయోధనా! నన్నేల నిందించెదవు. నేను నా శాయశక్తులా యుద్ధం చేస్తూనే ఉన్నాను. నేను నీకు ముందే చెప్పాను పాండుసుతులను గెలవడం సులభ సాధ్యం కాదని అయినా నీవు నామాటను లక్ష్య పెట్ట లేదు. అయినా నేను నీకు విజయం కలిగేలా యుద్ధం చేస్తాను " ఆ మాటలకు సుయోధనుడు కొంత ఊరట చెందాడు. మరునాడు యుద్ధంలో కురు సైన్యాలు మండల వ్యూహంలో నిలిచాయి. నీ కుమారులంతా అతనికి ఇరువైపులా పుట్టారు. ఇది చూసిన యుధిష్టరుడు ధృష్టద్యుమ్నునితో చెప్పి తన సైన్యాలను వజ్రవ్యూహంలో నిలిపాడు. తూర్యనాదాల నడుమ ఏడవ రోజు యుద్ధం ఆరంభమైంది. ద్రోణుడు విరాటుని, అశ్వథ్థామ శిఖండిని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుని, శల్యుడు నకుల సహదేవులను, విందాను విందులు యుధామన్యుని, పెక్కు మంది రాజులు అర్జునిని ఎదుర్కొన్నారు. భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేన, దుశ్శాసన, వికర్ణులను, అలంబసుడు సాత్యకిని, ధృష్ట కేతువు భూరిశ్రవుని, చేకితానుడు కృపాచార్యుని, ధర్మరాజు శ్రుతాయువును, పలువురు రాజులు భీష్ముని ఎదుర్కొన్నారు.
అర్జునిని ప్రతాపం
తన మీదకు వచ్చిన రాజులను అర్జునుడు రెండు చేతులతో గాండీవం నుండి బాణాలను వదులుతూ శరవర్షం కురిపిస్తున్నారు. వారంతా ఒక్క పెట్టున విజృంభించి కృష్ణార్జునులను తమ బాణాలతో ముంచెత్తారు. అది చూసిన నీ కుమారులు జయజయధ్వానాలు చేసారు. అప్పుడు అర్జునుడు కోపించి మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం కౌరవ సేనలు ప్రయోగించిన అస్త్రములను చీల్చి చెండాడి, వార రథాశ్వాలను చంపి మంధరపర్వతం పాలసముద్రాన్ని చిలికినట్లు కౌరవ సేనలను కలచి వేసింది. మహేంద్రాస్త్రం ధాటికి తట్టుకోలేని కౌరవ సేన భీష్ముని వెనుకకు చేరింది. త్రిగర్తాధీశులు తమ సైన్య స్మేతంగా పక్కకు వెళ్ళారు. భీష్ముడు మాత్రమే అర్జునిని ముందుకు వెళ్ళి నిలిచాడు. ఇది చూసిన సుయోధనుడు " కౌరవ యోధులారా ! తాత భీష్ముని ఒంటరిగా వదిలి పారిపోతున్నారా మీ వంటి వారు ఎక్కడైనా ఉంటారా ! వెళ్ళండి భీష్మునకు తోడుగా ఉండండి " అని అరిచాడు. రోషం వచ్చి కౌరవ సేనలు భీష్మునికి సాయంగా నిలిచాయి.
ద్రోణ విరాటుల పోరు
ద్రోణుడు విరాటుని విల్లును, ధ్వజమును రెండు బాణాలతో విరిచాడు. విరాటుడు మరొక బాణముతో ద్రోణుని శరీరంలో శరములు దించాడు. ద్రోణుని రథసారథిని చంపాడు, మరొక నాలుగు బాణములను వేసి ద్రోణుని విల్లు విరిచాడు. ద్రోణుడు కోపించి ఎనిమిది బాణాలను ప్రయోగించి విరాటుని రథాశ్వములను చంపాడు. రథమును కూల్చాడు. విరాటుడు తన కుమారుడైన శంఖుని రథాన్ని అధిరోహించి ద్రోణునిపై శరవర్షం గుప్పించాడు. వెంటనే ద్రోణుడు ఒక దివ్యాస్త్రాన్ని స్మరించి శంఖుని కొట్టాడు. ఆ బాణం శంఖుని గుండెలను చీల్చింది. శంఖుడు రథంపై వాలి మరణించాడు. తన కుమారుని మరణానికి ఖేదపడిన విరాటుడు చేసేది ఏమి లేక తన సైన్యాలను తీసుకుని పారిపోయాడు. అది చూసిన శిఖండి అశ్వథ్థామ ఫాలభాగమున మూడు బాణములు నాటాడు. అశ్వథ్థామ కోపించి తన బాణపరపరతో శిఖండి రథాశ్వములను చంపి, సారథిని చంపి, విల్లును విరిచి, కేతనమును విరిచాడు. శిఖండి రథం దిగి కత్తి దీసి అశ్వథ్థామ బాణములను అడ్డుకున్నాడు. అశ్వత్థామ బాణము ప్రయోగించి శిఖండి కత్తిని ఖండించాడు. శిఖండి వెంటనే సాత్యకి రథం ఎక్కాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు