ISSF వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇషా సింగ్: , వెంకట్ , మొలక ప్రతినిధి
అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న ISSF వరల్డ్ కప్-2026 షూటింగ్ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అసాధారణ ప్రతిభను కనబరిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో ఏకంగా 43 హిట్స్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఇషా సింగ్ విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
​భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయం
ఇషా సింగ్ సాధించిన ఈ అద్భుత విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచ స్థాయి వేదికపై అత్యుత్తమ స్కోరుతో రికార్డు నెలకొల్పడం ద్వారా ఇషా సింగ్ దేశ కీర్తిని దశదిశలా చాటిచెప్పారని ప్రశంసించారు.
​యువతకు స్ఫూర్తిదాయకం



హైదరాబాద్ నగరానికి చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ మరియు పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ఆమె ప్రదర్శన లక్షల మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు ఇది నిదర్శనమని అన్నారు.
​మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
భవిష్యత్తులో ఇషా సింగ్ మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై దేశం గర్వించేలా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమె క్రీడా ప్రస్థానం నిరంతరం విజయవంతం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు