కుటుంబ స్థితిగతులతో పాటు గురువులు,సోపతిగాండ్లు, చదువుసంధ్యలలో, సాహిత్య విన్యాసంలోనూ హితవరులు, బోధకుల ఆప్యాయత అనన్య అసామాన్య పాత్రను పోషిస్తుంది. దీనికి స్వయంకృషి, గొప్ప జ్ఞాన తృష్ణ, వెలుగుదీపంలా సాధన, కలిసిపోయే మనస్తత్వం బొమ్మగీస్తే అది సినారె నవ్వు. అన్నీ ఉన్న అదృష్టవంతుడు సినారె.తెలుగు సాహిత్యం ఆయన చిరునామా. కవిత్వం ఆతని సంతకం. వ్యాసోపన్యాసాలు ఆయన ఉచ్వాసనిశ్వాసాలు.శబ్దం ఆయన గుండె చప్పుడు,పదం ఆతని కాలి అందెలరవళి.సంగీత సాహిత్య సమలంకృతేః భావనతో సృజన చేసిన కళాత్ముడు,కళలతో ఆడుకున్న కావ్యాత్ముడు సినారె.
ఆధునిక తెలుగు సాహిత్యంలో తన అక్షరాలతో ఒక నూతన శకానికి నాంది పలికిన సాహితీ సుమం సినారె.
సినారె సాహిత్య, సినీ ప్రస్థానం ఒక ప్రభంజనం. జూలై 29, 1931 న రాజన్న సిరిసిల్ల జిల్లా(ఉమ్మడి కరీంనగర్ జిల్లా) హనుమాజీపేటలో జన్మించిన ఆయన సాహిత్య సేవలో 'కర్పూర' వసంతరాయలు' , 'మంటలు-మానవుడు', 'విశ్వంభర' వంటి గొప్ప కావ్యాలను రచించారు. ఆయన ప్రతిష్టాత్మక రచన 'విశ్వంభర' కు గాను 1988 లో జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు. అట్లనే సినీ 1962 లో 'గులేబకావళి కథ' సినిమాతో పాటల రచయితగా ప్రస్థానం ప్రారంభించి, 3,000 పైగా పాటలను అందించారు. 'అమ్మను మించి దైవమున్నదా', 'స్నేహమేరా జీవితం' వంటి పాటలు ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచాయి.ఆయన రాసిన గీతాలు కావ్య నాయిక నాయక యుగళ గీతాలుగా యువతను ఏఎన్నార్ స్టెప్స్ వేయించాయి. రసలోకాలలో తేలించాయి.అది ఒక అరుదైన ఘన చరిత్ర.సినారె శ్రమ జీవి,కృషీవలుడు,పట్టిందల్లా బంగారమైన అదృష్టజాతకుడు. ఆయన అందుకున్న పురస్కారాలలో జ్ఞానపీఠ్ తో పాటుగా భారత ప్రభుత్వం నుంచి 1977లో పద్మశ్రీ, 1992లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.
వేములవాడతో మమేకమైన సినారెకు పండిత సాంగత్యం బాగా అబ్బి సాహిత్యం మారాకు తొడిగింది. హైదరాబాద్ వచ్చాక సాహిత్య లోకంలో విస్తృతంగా పాల్గొన్నారు. అందులో దివాకర్ల వాగ్దాటి అబ్బింది.
మెరుగులు దిద్దుకుంటూ సాహిత్యంలో నిలబడ్డారు.ఇంత మంచి పునాది పాటు ఉర్దూ సాహిత్య అధ్యయనం ఆయనకు ఓ ఆభరణం.అదోప్లస్ పాయింట్ కూడా.అందుకే సినారె
'జ్ఞానపీఠానికే వన్నెతెచ్చిన సాహితీ సుమం' గా పేర్కొనడం.
సినారె మంచి గురువు.కంచు కంఠం ఆయనది.సినారె క్లాస్ రూమ్ విద్యార్థులతో క్రిక్కిరిస్తే, ఇతర విద్యార్థులు గది బయట కిటికీల నుండి పాఠాలు విన్న పరోక్ష విద్యార్థులు వేనవేలు అంటే అతిశయోక్తి కాదు.ఆయన గొప్ప వక్త. సందర్భోచిత హాస్యం పండించడంలో దిట్ట.అందుకే సినారె "శబ్దస్ఫూర్తి అపారం. అందుకే మాటల మాంత్రికుడు, శబ్దాల సంగీత దర్శకుడు" అంటారు సినీ సాహితీ జగత్తులో.ఆయన జీవితం 86ఏండ్లు.ఆయన రచనలు జీవితకాలంలో వెలుగుచూసినవి కూడా 86 గ్రంథాలు.సినారె అక్షరప్రేమికుడు,మనసు ప్రేమికుడు,మానవీయుడు కూడా. ఆయన కవితా ధారలో తడువని మనిషిలేడు.సినారె విశ్వంభర విశ్వకావ్యంగా నిలిచింది.నేటి తరానికి సినారె జీవితం,కవిత్వం,సామాజిక సాంస్కృతిక సేవలు ఆదర్శం. కవిత్వంలో ఆయన ఎంతగా మునిగి తేలాడో చెప్పడానికి,సినారె మాటల్లో
"ఏ.సి. గదిలో ఉన్నా
ఎందుకో ఉక్కపోతగా ఉంది.
కారణం, నేడు కవిత రాయలేదు గదా"
ఎంత గొప్ప హృదయోల్లాస కవిత.
ఇక నన్ను దోచుకుందువటే ఇక్కడ రాయకుంటే సినారె సినీ గీత విస్ఫోటనం ఎంత తెలిపినా తక్కువే,అసంపూర్ణమే.అంతటి పదలాలిత్య రసధుని ఆయన సొంతం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కాలేజీ,తెలుగు శాఖ అట్లనే 'త్రివేణి' గుండె ఆ మహనీయ మహామనీషి చిరునామా శాశ్వతం చేసుకున్న భారతీయ సాహితీవేత్తల డా.సి.నారాయణ రెడ్డి.
సినారె జ్ఞానపీఠ అవార్డ్ అందుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో సాహితీ గౌతమి సంస్థద్వారా 1988 నుండి ప్రతి సంవత్సరం సినారె సాహిత్య అవార్డ్ ను కవిత్వంలో అందించడం గొప్ప ప్రేరణ.
ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) జూన్ 12, 2017న కన్నుమూశారు. ఆయన వర్ధంతి ప్రతి సంవత్సరం జూన్ 12న నిర్వహిస్తారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి