అమ్మ ఆది గురువు : - నామ వెంకటేశ్వర్లు
అమ్మంటే.. ఆప్యాయత, అనురాగాల లోగిలి.
అమ్మంటే.. అడగకుండానే అన్ని వరాలు ఇచ్చే ఆది దేవత.

అమ్మంటే...
అల్లరి చేసినా గదమాయించకుండ ప్రేమతో
బాగోగులు నేర్పే ఆది గురువు.

అమ్మంటే..
తనతో ఆడుతూ... ఆడిస్తూ.. పాడుతూ.. పాడిస్తూ...

ఇతరులెవ్వరు పొట్లాటకొచ్చినా ముందుండు,
ప్రవాహాన్ని (అలల్ని) నిలువరించే ఆనకట్టల్లె.

పొద్దుగాల మేలుకొనుటలో
నాన్నతో పాటే,
నాయకుని జనులనుసరించునట్లు.

అమ్మ ఇల్లూడ్చి... సాన్పు జల్లి,
అలికి ఇంటిముందర ముగ్గు వేస్తే,
గడ మంచానికి నులక అల్లిన అలంకారం.

అమ్మ తోమిన అంట్లు
ఉరుము ఉరిమి మెరిసిన చందంబునుండు.

అమ్మ బట్టలు ఉతికితే...
మల్లె చెట్టుకు మల్లెలు విరబూసిన అందమల్లె.

నిన్న మాపువేళ దంచిన ఒడ్ల బియ్యం
గాలించి పొయ్యి పైన పెట్టి,
ఒడుపుగా కట్టెలు పేర్చి,
నిప్పు నంటించు ఆదరణగా.

అన్నం మొండునప్పుడే
కాయగూరలు కోయు కుదురుగాను,
కోసిన కూరలు పూని తిరగమోతేసి,
ఉడికించు ఎంతో తెలివితోను.

వంట నొడిపించి,
మేము నానవదిలిన
కట్టు బట్టలుతుకు కనికరముతో.

బడికి మమ్ము నంప,
తానంబులాడించి,
తయారు చేయు నెంతో
సంతోషపడుతూ.

అన్నం వడ్డన చేసి ఆరగింపజేసి,
సద్దులు కట్టు చక్కగానూ.

చదువు చక్కపెట్ట మేము
పోగా బడికి,
సాయమందించు చేను పనుల
నాన్న చెంత చేరి.

పొద్దంత పనిచేసి అలసిపోయిన గాని,
కోయు పసుల గడ్డి
పొందుగాను.

తా నిల్లు చేరి కాలు కడిగి,
అలవాటుగా ఒత్తుపోయిన అన్నమొండగా,
కాగిన నీళ్లు తనకు నాన్నకు తోడు.

అందరినొక చోట చేర్చి,
రాత్రి అన్నము వార్చు అన్నపూర్ణలా.

అందరు తిన్నంక
తాను తినును.
విసుగు వెసారులేక,
పాలు తోడు పెట్టి,
అన్నీ సర్ది పెట్టు చివరకు.

అమ్మ వంట రుచి చూడ
ఆహా... నలభీములు యాదికొచ్చు.

అలసి, అదమరచి
హాయిగా నిదురబోవు..
నిబ్బరంగా.

అమ్మకు ఎందైన, ఎవరైనా
సాటి, పోటీ నిలుచువారు
నేలపైన లేరు.

అమ్మా.. నీ సేవ..., నీ సహనం..., నీ త్యాగానికి సాటి
న భూతో... న భవిష్యతి...




కామెంట్‌లు