తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం నజీబ్‌నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నాణ్యమైన ఆహారం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచి విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. వసతి గృహాల్లో వేడి నీటి సౌకర్యం కోసం సోలార్ వ్యవస్థల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యాలను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
పేద కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పాలనలోనే కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్ పాఠశాల ప్రత్యేక అధికారిని సుజాత ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి