ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము-296 వ రోజు
అభిమన్యుడు కౌరవసేనను మట్టుబెట్టుట
అభిమన్యుడు ఎదుట నిలువడానికి ఎవరికి ధైర్యం లేదు. దొరికిన వారిని దొరికినట్లు చంపుతున్నాడు. కురుసేన అంతా భయంతో నలుదిక్కుల పారిపోయారు. శల్యుని కుమారుడు రుక్మరధుడు వచ్చి " వీడికి నేను ఓడేదేమిటి. నేను వీడిని పట్టి ఇస్తాను నా పరాక్రమము ఏమిటో మీకు తెలుస్తుంది. మీకేమి భయం లేదు " అన్నాడు. అని అభిమన్యుని ఎదుర్కొని తొమ్మిది బాణములను అభిమన్యుని భుజముల మీద వక్షస్థలము మీద నాటాడు. అభిమన్యుడు ఒకే బాణంతో వాడి తల నరికాడు. రుక్మధరుని మరణము చూసిన అతడి స్నేహితులు, సాటి రాజులు ఒక్కుమ్మడిగా అభిమన్యుడి మీద విజృంభించి అతడి మీద శరములు గుప్పించారు. వారి శరములలో కనిపించని అభిమన్యుని రథం చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు. అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ గంధర్వ మాయ పూర్వము అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దానిని అభిమన్యునికి ప్రసాదించాడు. గంధర్వ మాయా ప్రభావం వలన ఎంతో మంది వీరులు తమపై బాణములు కురిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యములకు శత్రుసేన భయముతో వణికింది. అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారంతా మృతులై ఉన్నారు. అభిమన్యుని యుద్ధనైపుణ్యం చూసి కౌరవసేన ఆశ్చర్యపోయింది. ఇది పనికాదని తలచి సుయోధనుడు స్వయంగా అభిమన్యునితో యుద్ధం చేసాడు. కాని అభిమన్యుని ధాటికి ఆగలేక ప్రాణములు దక్కించుటకు అక్కడి నుండి తొలగి పోయాడు. ధృతరాష్ట్రుడు అభిమన్యుని పరాక్రమము విని " సంజయా ! ఒక్క బాలుడు ఇంత మందిని వధించాడా ! నమ్మ లేక పోతున్నాను. అవునులే అభిమన్యుడు ధర్మాన్ని ఆశ్రయించాడు. ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని జయిస్తుంది కదా ! " అన్నాడు.
అభిమన్యుడు లక్ష్మణ కుమారుని వధించుట
అభిమన్యుని పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు మొదలగు వారు పారిపోయారు. నీ కుమారులకు చెమటలు పట్టి దిక్కులు చూస్తున్నారు. పారిపోయిన సుయోధనుడు అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకుని మొదలగు వారిని కూడగట్టుకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు మేఘఘర్జన చేసి పిడుగు వలె వారి మీద పడ్డాడు. సుయోధనుని కుమారుడు, నీ మనుమడు లక్ష్మణకుమారుడు అభిమన్యుని ఎదుర్కొని నిరంతర శర ప్రయోగం చేసాడు. తన కుమారుని విడువలేని సుయోధనుడు అభిమన్యునితో పోరు చేస్తున్నాడు. అభిమన్యుడు లక్ష్మణకుమారుని మీద బాణములు గుప్పించాడు. ఇరువురి నడుమ పోరు ఘోరరూపం దాల్చింది. అభిమన్యుడు ఒకే బాణంతో లక్ష్మణకుమారుని తల తెగనరికాడు. తన కుమారుని మరణం కళ్ళారా చూసిన సుయోధనుడు మిక్కుటమైన కోపంతో ఊగిపోతూ వీడిని కొట్టండి, నరకండి, చంపండి అని ఆక్రోశించాడు. కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, బృహద్బలుడు అత్యంత ప్రభావం కల శరములు అభిమన్యునిపై వేసారు. అభిమన్యుడు ఆ బాణములను త్రుంచి తన సారథితో రథమును సైంధవుని వైపు మళ్ళించమని చెప్పాడు. ఇంతలో కళింగులు నిషాదులు తమ తమ సైన్యంతో వచ్చి అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు వారితో వీరావేశంగా పోరుతున్నాడు. అక్కడ సైంధవుడు పాండవులను పద్మవ్యూహం లోకి రానీయకుండా అడ్డుకుంటున్నాడు. అభిమన్యుడు ద్రోణునిపై ఏభై బాణములు, కృతవర్మ మీద ఎనభై బాణములు, అశ్వత్థామ మీద పది బాణములు కర్ణుని మీద ఒక్క బాణము వేసి నొప్పించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి