ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు: -- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

  ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. శుక్రవారం ఆయన ఊషన్నపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ఒక ప్రభుత్వ పాఠశాల నడవాలంటే నెలకు సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఆ డబ్బంతా ప్రజలదేనన్నారు. ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండగా, సుదూర ప్రాంతాలకు వెళ్లి, ప్రైవేటులో చదువుకొనడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కష్టపడి సంపాదించిన డబ్బును తల్లిదండ్రులు వృధా చేసుకోవద్దని, తమ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి, అక్కడి ఉపాధ్యాయుల చేత చక్కగా చదువు చెప్పించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు, సాంకేతిక విద్య అందుబాటులో ఉందని, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల సేవలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.
కామెంట్‌లు