రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ప్రపంచ స్థాయి వసతులతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది కేవలం పేదలు, అనాధలే అన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చనే ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నింపాలన్న లక్ష్యంతో ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించిన సీఎం, విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి అని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లకు పైగా విద్యాశాఖ కోసం కేటాయిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 1,814 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడం, సీట్లు ఖాళీ లేవని బోర్డు పెట్టే స్థాయికి రావడం గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు అభినందనీయులని కొనియాడారు.
విద్యతోనే సమాజంలో అసమానతలను తొలగించవచ్చని పేర్కొన్న ముఖ్యమంత్రి, కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కిట్లు అందించేందుకు రూ.688 కోట్లతో టెండర్లు పిలిచామని, జూలై చివరి నుంచి పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చిన సీఎం, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడల్లో రాణించేలా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఆరుట్ల పబ్లిక్ స్కూల్ తెలంగాణ విద్యా రంగానికి ఆదర్శంగా నిలిచి, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి