"గోవిందా... గోవిందా..." అనే నామస్మరణతో మొదలైన ఆ రోజులు ఇప్పటికీ నా మనసులో సజీవంగా ఉన్నాయి.
అరవై సంవత్సరాల క్రితం తిరుపతి యాత్ర అంటే కేవలం ఒక ప్రయాణం కాదు... అది భక్తి, కుటుంబ బంధాలు, ఆచార సంప్రదాయాలు,
ప్రేమ, ఆప్యాయతలతో నిండిన ఒక పవిత్ర అనుభవం.
యాత్రకు వారం రోజుల ముందే ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనేది. అమ్మమ్మ, నానమ్మలు ఇల్లంతా శుభ్రం చేసి, స్వామివారి యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టేవారు.
పులిహోర, దద్దోజనం, అరిసెలు, చేగోడీలు, అప్పడాలు, వడియాలు... ప్రయాణంలో పాడవకుండా ఉండే వంటకాలన్నీ ఎంతో ప్రేమగా తయారుచేసేవారు.
పెద్ద ఇత్తడి డబ్బాల్లో వాటిని సర్ది, పక్కనే ఇత్తడి మర్రి చెంబుల్లో మంచినీటిని నింపుకుని సిద్ధం చేసేవారు.
మా కుటుంబం బ్రాహ్మణ సంప్రదాయాలను ఎంతో నిష్ఠగా పాటించేది. అందుకే ప్రయాణంలో కూడా మడి ఆచారానికి ఎక్కడా భంగం కలగకుండా అమ్మమ్మ, నానమ్మలు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. ఇత్తడి మర్రి చెంబులను ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ, వాటిలోని నీటినే ఉపయోగించేవారు.
అది ఎవరికైనా గొప్పతనం చూపించడానికి కాదు; తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని భక్తితో గౌరవించడమే.
యాత్ర రోజు తెల్లవారుజామునే ఇంట్లో హారతి ఇచ్చి, పెద్దలు పిల్లల తలపై అక్షింతలు వేసి, "శ్రీ వేంకటేశ్వరస్వామి మీ అందరినీ చల్లగా చూడాలి" అని ఆశీర్వదించేవారు.
పొరుగింటివారు కూడా వచ్చి, "మా తరఫున కూడా స్వామివారికి నమస్కారం చెప్పండి" అని చెప్పి, చేతిలో నాణాలు పెట్టి పంపించేవారు.
రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బొగ్గుతో నడిచే ఇంజిన్ నల్లని పొగలు వెదజల్లుతూ ఘోరంగా కూత వేసేది. ఆ శబ్దం వినగానే పిల్లలందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేది.
కిటికీ పక్కన సీటు దొరికితే ప్రపంచమే దక్కినట్టుగా అనిపించేది.రైలు కదలగానే అమ్మమ్మ మెల్లగా "గోవిందా... గోవిందా..." అంటూ జపించడం మొదలుపెట్టేది.
నానమ్మ తిరుమల మహత్యం, శ్రీనివాసుని లీలలు, పురాణ కథలు చెప్పేది. ఆ కథలు వింటూ గంటలు ఎలా గడిచిపోయేవో తెలియదు.
ఆ రోజుల్లో పెద్దలంటే ఎంత గౌరవమో! తాతయ్య కూర్చున్న చోట ఎవరూ కాళ్లు చాపి కూర్చునేవారు కాదు.
అమ్మమ్మకు నీళ్లు అందించడం, నానమ్మకు సంచి మోయడం, చిన్న పిల్లలను చూసుకోవడం—ఇవి ఎవరు చెప్పకుండానే అందరూ చేసేవారు. ఒకరి పిల్లలు అందరి పిల్లలే. ఒకరి ఆనందం అందరి ఆనందమే.
ప్రతి స్టేషన్‌లో "కాఫీ... కాఫీ...", "వడలు... బజ్జీలు..." అంటూ విక్రేతల కేకలు వినిపించేవి. కానీ బయట ఆహారం కొనడం చాలా అరుదు.
అమ్మమ్మ తెచ్చిన పులిహోరను అరటి ఆకుపై అందరికీ వడ్డించేది.
ఆ రుచిలో ఇంటి ప్రేమ ఉండేది... భక్తి ఉండేది... అమ్మ చేతి మమకారం ఉండేది.కుటుంబం అంతా కలిసి ప్రయాణిస్తుంటే నవ్వులు, ఆటలు, సరదాలు కూడా ఉండేవి. బావలు, మరదళ్లు ఒకరినొకరు చాటుగా ఆటపట్టించుకోవడం,
కిటికీ సీటు కోసం చిన్న చిన్న పంతాలు వేయడం, అమ్మమ్మ చూడకుండా అరిసె ఒకటి దాచుకోవడం... అవన్నీ అమాయకపు సరదాలే.
మర్యాద దాటని చిలిపితనం, అందరినీ నవ్వించే ఆప్యాయత మాత్రమే ఉండేది.
ఒకసారి పెద్ద స్టేషన్‌లో రైలు ఆగింది. "సుజా ... నీకు కాఫీ తీసుకురానా?" అని మా బావ మెల్లగా అడిగాడు మా అక్కయ్యను.
"అయ్యో! అమ్మమ్మ చూస్తుంది బావా . నాకు ఏమీ వద్దు..." అని సిగ్గుతో తలదించుకుంది మా అక్కయ్య. కానీ కొద్దిసేపటికి ఆమెకు ఇష్టమైన జామపండు ఎలాగో మా బావ చాటుగా ఆమెకు తెచ్చిచ్చాడు. నేను చూసి నవ్వితే నా నెత్తి మీద ఒక మొట్టికాయ ఇచింది.ఇద్దరూ ఒకసారి కళ్లు కలిపి నవ్వుకున్నారు.
అది చూసిన నానమ్మకు అంతా అర్థమై, ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వింది. ఆ రోజుల్లో ప్రేమకూ హద్దులు ఉండేవి... సరదాకూ సంస్కారం ఉండేది.
రాత్రి క్రమంగా ముసురుకుంది. భోజనాలు అయ్యాయి. అమ్మమ్మ పిల్లలకు దుప్పట్లు కప్పింది. నానమ్మ మెల్లగా "గోవిందా... గోవిందా..." అంటూ జపం చేస్తూనే నిద్రలోకి జారుకుంది.
తాతయ్య తన పక్కనే పడుకున్న మా చిన్న తమ్ముని పై ప్రేమగా చేయి వేసి నిద్రపోయాడు.
బోగీ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
కానీ నాకు మాత్రం నిద్ర పట్టేది కాదు.
కిటికీ పక్కనే కూర్చొని, కిటికీలోంచి బయటకు కనిపించే ఆ రాత్రి ప్రపంచాన్ని తనివితీరా చూస్తూ ఉండేవాడిని.
దూరంగా మెరిసే చిన్న చిన్న దీపాలు... అప్పుడప్పుడు కనిపించే చిన్న స్టేషన్లు... వెన్నెలలో మెరుస్తున్న పొలాలు... రైలు వంతెన మీదుగా వెళ్తుంటే కింద ప్రవహించే నది... దూరంగా కనిపించే కొండల నీడలు... ఇవన్నీ నా చిన్న మనసును వర్ణించలేని ఆనందంలో ముంచెత్తేవి.
రైలు చక్రాలు "టక్... టక్... టక్..." అంటూ ఒక మధురమైన లయను పలుకుతుంటే, ఆ శబ్దమే నాకు సంగీతంలా అనిపించేది. అందరూ గాఢనిద్రలో ఉండగా, నేనొక్కడినే ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని క్షణాలను నా హృదయంలో దాచుకుంటూ ఉండేవాడిని.
కొన్నిసార్లు అమ్మమ్మ మెలకువ వచ్చి, "ఇంకా పడుకోలేదా రా? రేపు స్వామివారి దర్శనం ఉంది..." అని ప్రేమగా చెప్పేది."ఇంకొంచెం చూస్తాను అమ్మమ్మ..." అంటే, ఆమె నవ్వుతూ "సరే... చల్లగాలి ఎక్కువ తగలకుండా కిటికీ కొంచెం మూసుకో" అనేది.
ఆ ఒక్క మాటలో ఎంత ప్రేమ ఉందో... ఎంత ఆప్యాయత ఉందో... ఇప్పుడు అర్థమవుతోంది.
తెల్లవారుజామున రైలు తిరుపతి చేరువలోకి రాగానే ఎవరో "అదిగో... ఏడుకొండలు!" అని చెప్పేవారు. వెంటనే అందరూ చేతులు జోడించి, "గోవిందా... గోవిందా..." అంటూ నమస్కరించేవారు. అందరి కళ్లలో ఆనందబాష్పాలు మెరిసేవి.
"స్వామి పిలిస్తేనే ఈ కొండ మీదకు రావడం సాధ్యం" అనే విశ్వాసం ప్రతి హృదయంలో ఉండేది.
ఆ రోజుల్లో డబ్బు తక్కువైనా, మనుషులు ధనవంతులు. సౌకర్యాలు తక్కువైనా, సంతోషాలు ఎక్కువ. సమయం నెమ్మదిగా గడిచినా, బంధాలు ఎంతో బలంగా ఉండేవి.
కుటుంబమంతా కలిసి చేసిన ఆ రైలు ప్రయాణం, అమ్మమ్మ చేతిలోని ఇత్తడి మర్రి చెంబు, నానమ్మ నోట వినిపించిన "గోవిందా" నామస్మరణ, తాతయ్య ఆశీర్వాదం, బావ–మరదళ్ల అమాయక నవ్వులు, రైలు కిటికీలోంచి నేను చూసిన ఆ అందమైన రాత్రి ప్రపంచం...
ఇవన్నీ ఈ రోజు జ్ఞాపకాలే కావచ్చు... కానీ నా హృదయంలో మాత్రం అవి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
ఈ రోజుల్లో రైళ్లు మరింత వేగంగా పరిగెడుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంది. సౌకర్యాలు ఎన్నో వచ్చాయి. కానీ ఆ రోజుల్లో ఉన్న ఆప్యాయత, ఆ అనుబంధం, పెద్దల ఆశీర్వాదం, చిన్నవారి అమాయకత్వం, కుటుంబమంతా కలిసి చేసిన ఆ తిరుపతి యాత్రలోని ఆనందం మాత్రం ఎక్కడో వెనుకబడిపోయింది.
కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరుకున్నాక ముగిసిపోతాయి... కానీ కొన్ని ప్రయాణాలు జీవితాంతం మన హృదయంలో కొనసాగుతూనే ఉంటాయి. మా అమ్మమ్మ, నానమ్మలతో చేసిన ఆ తిరుపతి రైలు ప్రయాణం అలాంటి చిరస్మరణీయమైన యాత్ర. అది ఒక జ్ఞాపకం కాదు... ఒక యుగం. ఒక అనుభూతి. ఒక జీవితం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి