ఫిన్లాండ్ వెళ్లి వచ్చిన అరుణకుమారికి అభినందన


 ఫిన్లాండ్ దేశంలో అంతర్జాతీయ విద్యా విధానంపై ప్రభుత్వం తరఫున శిక్షణ పొంది, నేడు తిరిగి పాలఖండ్యాం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయని కె.అరుణ కుమారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గతేడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన అరుణ కుమారితో పాటు పురస్కార గ్రహీతలంతా ఫిన్లాండ్ దేశంలో విద్యా విధానాన్ని పదిహేను రోజుల పాటు అధ్యయనం గావించారు. అరుణ కుమారి సేవలను కొనియాడుతూ శాలువా, జ్ఞాపికలతో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, కర్రి రమణ, సి.హెచ్. రాజేశ్వరరావు, పిల్లల దాలమ్మ, విద్యార్ధులు ఘనంగా సన్మానించారు. ఫిన్లాండ్ దేశంలో విద్యా పథకాలను విధానాలను శిక్షణ అంశాలను అరుణకుమారి వివరించారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెల్పుతూ పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి విద్యార్థుల గుణాత్మక విద్యా సాధనకు సద్వినియోగపరుస్తానని ఆమె అన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు