జింక సమయస్ఫూర్తి: : వై. గగనశ్రీ -8వ తరగతి-ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), మండలం: ఎడపల్లి,-జిల్లా: నిజామాబాద్.


 అంబం అనే గ్రామం పొలిమేరలో ఒక విశాలమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక క్రూరమైన మొసలి నివసిస్తూ ఉండేది. రోజూ దాహం తీర్చుకోవడానికి ఆ చెరువు వద్దకు వచ్చే జంతువులను మొసలి మాటువేసి, వేటాడి తినేది. దాంతో అటువైపు వెళ్లడానికే అడవి జంతువులు భయపడేవి.
ఒకనాడు మండుటెండ వేళ, ఒక నక్క దాహంతో నకనకలాడుతూ నీరు తాగడానికి ఆ చెరువు గట్టుకు వచ్చింది. దాన్ని చూసిన మొసలి నెమ్మదిగా నీటి పైకి వచ్చి, "మిత్రమా! ఒక్కసారి ఇటు రావా? నీతో ఒక ముఖ్యమైన పని ఉంది" అని ఆప్యాయంగా పిలిచింది.
నక్క కాస్త జంకుతూనే, "ఏమిటి ఆ పని?" అని అడిగింది.
"రెండు రోజులుగా సరైన ఆహారం లేక నా కడుపు మండిపోతోంది. నీటి ఒడ్డున నేను చనిపోయినట్లు నటిస్తూ కదలకుండా పడి ఉంటాను. నువ్వు ఏదో ఒక జంతువును మాయమాటలతో నమ్మించి ఇక్కడికి తీసుకురా. దాన్ని వేటాడి ఇద్దరం పంచుకు తిందాం" అని మొసలి పలికింది.
జిత్తులమారి నక్క తన స్వార్థాన్ని ఉపయోగించి, "సరే, నీ ఉపాయం బాగుంది. కానీ ఒక షరతు. నేను ఎప్పుడు నీళ్లు తాగడానికి వచ్చినా నువ్వు నాపై దాడి చేయకూడదు, నన్ను ప్రాణాలతో వదిలేయాలి" అని అడిగింది. అందుకు మొసలి అయిష్టంగానే సమ్మతించింది.
నక్క వెంటనే అడవిలోకి వెళ్లి, గడ్డి మేస్తున్న జింకను చూసింది.  దాని దగ్గరకు వెళ్లి "ఓ జింక నేస్తమా! మన ఊరి చెరువులో అమృతం లాంటి స్వచ్ఛమైన తియ్యని నీళ్లు, పక్కనే పచ్చని గడ్డి ఉన్నాయి. అక్కడికి వచ్చి తనివితీరా గడ్డి మేసి, నీళ్లు తాగు" అని మభ్యపెట్టింది. జింకకు నక్క ప్రవర్తనపై అనుమానం కలిగింది. ‘ఎప్పుడూ మోసాలు చేసే నక్కకు నాపై ఇంత ప్రేమేమిటి? ఇందులో ఏదో మతలబు ఉంది’ అని గ్రహించింది. అయినా విషయాన్ని తేల్చుకోవాలని నక్క వెంటే నడిచింది.
చెరువు ఒడ్డుకు చేరుకోగానే దూరంగా చలనరహితంగా పడి ఉన్న మొసలిని జింక గమనించింది. అప్పుడు నక్కతో అత్యంత వినయంగా, "మిత్రమా! నువ్వే నా కంటే పెద్దవాడివి. ముందుగా నువ్వు వెళ్లి నీళ్లు తాగు, నీ వెనుకే నేను వస్తాను" అని ముందు నడవాల్సిందిగా కోరింది.
నక్క నీటి అంచుకు చేరగానే, జింక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బలమంతా ఉపయోగించి నక్కను వెనుక నుంచి ఒక్క తోపు తోసింది. ఆ వేగానికి నక్క నీటిలోకి కొట్టుకుపోయింది. వెంటనే జింక ప్రాణభయంతో క్షణాల్లో అడవిలోకి పారిపోయింది.
చెరువులో పడిన నక్కను చూసిన మొసలి, 'నక్క బావ నా కోసమే ఆహారాన్ని నీటిలోకి తోశాడు' అనుకుని కళ్లు మూసుకుని దానిని  నోట కరచి మింగేసింది.
ఆకలి మీదున్న మొసలి నక్కను పూర్తిగా మింగి, కడుపు నిండిన తృప్తితో నెమ్మదిగా కళ్లు తెరిచింది.  తన నోటికి చిక్కింది జింక కాదని, తనతో ఒప్పందం చేసుకున్న నక్కేనని దాని ఎముకలను నములుతున్నప్పుడు అర్థమైంది. అప్పుడు దానికి అసలు విషయం బోధపడలేదు. 'అయ్యో! నాతో చేతులు కలిపిన నక్కే చచ్చిపోయింది, ఏమైతేనేం నా ఆకలి తీరింది.
మరోవైపు ప్రాణభయంతో అడవిలోకి పరుగు తీసిన జింక, నేరుగా పచ్చిక బయళ్లలో సేదతీరుతున్న ఇతర అడవి జంతువుల వద్దకు చేరుకుంది. భయంతో రొప్పుతున్న జింకను చూసి అడవికి పెద్ద అయిన ఏనుగు, "ఏమైంది జింకపిల్లా? ఎందుకు అంతగా భయపడుతున్నావు?" అని ఆరా తీసింది.
జింక కాసేపు ఆగి, శ్వాస పీల్చుకుని జరిగిన కథనంతా మొదటి నుంచి పూసగుచ్చినట్లు వివరించింది. నక్క పన్నిన మాయోపాయం, మొసలి చేసిన కపట నాటకం, తాను సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకున్నదీ వివరంగా చెప్పింది.
ఆ మాటలు విన్న అడవి జంతువులన్నీ నిర్ఘాంతపోయాయి. "మొసలి ఆకలితో చెరువు ఒడ్డునే పొంచి ఉంది కాబట్టి, ఇకపై అటువైపు ఎవరూ వెళ్లకూడదు" అని అడవిలోని జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. చెరువుకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేసి, అడవికి అవతలి వైపు ఉన్న స్వచ్ఛమైన కొండ వాగు దగ్గరకే నీటి కోసం వెళ్లడం ప్రారంభించాయి.
రోజులు గడిచాయి. అంబం చెరువు వైపు ఒక్క జంతువు కూడా రావడం మానేసింది. నక్క సహాయం కోల్పోయి, అడవి జంతువుల రాక ఆగిపోవడంతో మొసలికి ఆహారం దొరకడం గగనమైపోయింది. రోజురోజుకూ దాని శరీరం చిక్కిశల్యమైపోయింది. జింకను మోసం చేయాలని చూసిన నక్క ప్రాణాలు కోల్పోగా, ఆ నక్కపై ఆధారపడి మోసంతో పొట్ట నింపుకోవాలనుకున్న మొసలి చివరికి ఆకలితో అలమటించి చెరువు ఒడ్డునే ప్రాణాలు వదిలింది.
జింక చూపిన వివేకం తన ప్రాణాలను కాపాడటమే కాకుండా, తోటి అడవి జంతువులన్నింటికీ కళ్లు తెరిపించి ఒక పెద్ద ప్రమాదం నుంచి రక్షించింది. దుష్ట ఆలోచనలతో మొదలైన ఏ స్నేహమైన చివరకు వినాశనానికే దారితీస్తుందని ఈ సంఘటనతో అడవిలోని జంతువులన్నీ గ్రహించాయి.
=============================================================
 నీతి: తోటివారికి గోతులు తవ్వే దుర్మార్గులు, తాము చేసిన మోసానికే తామే బలవుతారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎలాంటి ఆపద నుంచైనా క్షేమంగా బయటపడవచ్చు.
---------------------------------------------------------------
 గైడ్ టీచర్: బొడ్డు భరద్వాజ 
స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రాథమికోన్నత పాఠశాల అంబం ఎడపల్లి నిజామాబాద్ జిల్లా.
కామెంట్‌లు