అంబం పల్లెలో తెల్లవారుజామునే పక్షుల కిలకిలారావాలతో పాటు పొలాల బాట పట్టిన రైతుల ముచ్చట్లు వినపడుతున్నాయి. ఆ ఊరి చివర ఓ చిన్న పెంకుటింట్లో రవి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. తండ్రి ఎండనకా, వాననకా పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటే, తల్లి ఇతరుల ఇళ్లలో చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఇల్లు గడవడమే గగనంగా ఉన్నా, ఆ తల్లిదండ్రులు కొడుక్కి ఒకటే మాట నూరిపోసేవారు. "ఒరేయ్ రవి! మన ఒంటిమీద చిరిగిన బట్టలున్నా పరవాలేదు గానీ, ఎవరినీ మోసం చేయకుండా, నిజాయితీతో ఉండాలి. కష్టపడి సంపాదించిన గంజినీళ్లయినా అమృతంలా తృప్తినిస్తాయి. ఇతరుల సొమ్ముపై ఆశపడితే పాపం చుట్టుకుంటుంది."
తల్లిదండ్రుల మాటలను రవి తన గుండెల్లో పదిలంగా దాచుకున్నాడు. బడిలో ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ, తరగతిలో అందరితో కలివిడిగా, మర్యాదగా ఉండేవాడు.
ఓ రోజు మధ్యాహ్నపు ఎండలో రవి బడికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి పక్కన దట్టంగా అల్లుకున్న పాత మర్రిచెట్టు నీడన ఏదో బరువుగా ఉన్న తోలు సంచి పడి ఉండటం చూశాడు. అక్కడ ఆగి, అటూఇటూ తెరిపారగా చూసి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. జిప్పు తీసి చూడగానే అతని కళ్లు చెదిరిపోయాయి. లోపల కట్టల కొద్దీ రూపాయల నోట్లు, భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన దస్తావేజులు ఉన్నాయి.
క్షణకాలం రవి మనస్సులో చిన్న ఆశ మొదలైంది. 'ఇంత డబ్బా! ఈ డబ్బుతో మా నాన్న అప్పులన్నీ తీరిపోతాయి, అమ్మ కష్టాలు తీరతాయి...' అన్న ఆలోచన మనసు లో మెరిసింది. కానీ మరుక్షణమే ఇంట్లో నాన్న చెప్పిన సంస్కారం, అమ్మ నేర్పిన నిజాయితీ కళ్లముందు కదలాడాయి. 'ఇది మన కష్టం కాదు. ఈ సొమ్ము పోగొట్టుకున్న వాళ్లు ఎంతగా రోదిస్తున్నారో, ఈ కాగితాలు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో!' అని భావించి వెంటనే సంచిని భద్రంగా మూసి, వేగంగా అడుగులు వేస్తూ బడి వైపు నడిచాడు.
బడికి చేరుకోగానే నేరుగా ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి, "సార్! దారిలో మర్రిచెట్టు కింద ఈ సంచి దొరికింది. ఇందులో చాలా డబ్బు, విలువైన పత్రాలు ఉన్నాయి. ఎవరో పోగొట్టుకున్నట్లున్నారు, దయచేసి చూడండి" అంటూ బల్లపై ఉంచాడు. మాస్టారు ఆశ్చర్యంతో సంచి తెరిచి చూసి, రవి నిష్కల్మషమైన చూపులను చూసి మనసులోనే అబ్బురపడ్డారు.
అంతలోనే బడి ముంగిట ఓ వృద్ధుడు కన్నీళ్ల పర్యంతమవుతూ, ఆయాసపడుతూ వస్తున్నాడు. ప్రధానోపాధ్యాయిని దగ్గరకు వచ్చి "అయ్యా! జీవితాంతం దాచుకున్న పైకం, పొలం కాగితాల సంచి దారిలో ఎక్కడో జారిపడిపోయింది. దారిలో ఒకతను మీ పాఠశాల పిల్లవాడికి దొరికిందని చెప్పాడు అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.
మాస్టారు ఆయనను ఓదారుస్తూ, బల్లపై ఉన్న సంచిని చూపించారు. దాన్ని చూడగానే ఆ పెద్దాయన ప్రాణం లేచివచ్చినట్లయింది. సంచిని తీసుకొని చూసుకున్నాడు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వెంటనే ఆ సంచిలో నుండి కొన్ని రూపాయలను తీసి అక్కడ ఉన్న రవి చేతిలో పెట్టబోయాడు.
రవి రెండు చేతులూ వెనక్కి తీసుకున్నాడు. "తాతా! మీ వస్తువును మీకు అప్పగించడం నా బాధ్యత మాత్రమే. మీ కష్టార్జితాన్ని నేను బహుమతిగా తీసుకోలేను. మీ ఆశీర్వాదం ఉంటే అంతే చాలు" అని చిరునవ్వుతో పలికాడు.
ఆ మాటలకు వృద్ధుడి కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలాయి. "ఇంతటి దారిద్ర్యంలోనూ ఇంతటి ధర్మబుద్ధా నాయనా! నీలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులు ధన్యులు" అంటూ నిండు మనస్సుతో దీవించాడు.
సాయంత్రం ప్రార్థనా సమయంలో ప్రధానోపాధ్యాయులు రవిని స్టేజ్ పైకి పిలిచారు. జరిగిన సంఘటనను విద్యార్థులందరి ముందూ వివరించారు. "పిల్లలూ! పుస్తకాల్లో చదివే చదువు కంటే ప్రవర్తనలో కనిపించే నిజాయితీ ఎంతో గొప్పది. పేదరికం ఉండొచ్చు, కానీ మన సంస్కారంలో ఉండకూడదని రవి నిరూపించాడు" అంటూ అందరి చప్పట్ల మధ్య రవిని ప్రశంసించారు.
ఆ క్షణం నుంచి గ్రామంలో రవి అంటే అందరికీ ఎనలేని గౌరవం ఏర్పడింది. కాలం గడిచింది, రవి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా బాల్యంలో అలవడిన ఆ నిజాయితీని, నీతిని అతడు ఏనాడూ విడిచిపెట్టలేదు.
నీతి:
సంపద అనేది క్షణికమైనది, కానీ నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం చిరకాలం నిలిచి గౌరవాన్ని అందిస్తుంది. తాత్కాలిక స్వార్థాన్ని జయించి ధర్మం వైపు నిలబడిన మనిషికి జీవితంలో ఆలస్యమైనా అచంచలమైన విజయమూ, సమాజంలో ఉన్నతమైన స్థానమూ లభిస్తాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి