హరికథా పితామహునికి అక్షరాంజలి : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - పుష్యమి -సెయింట్ లూయిస్ - అమెరికా.


విద్యలకు నిలయమైన 
విజయనగరం దరి అజ్జాడ గ్రామంలో
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 
సరస్వతీ మాత కృపచే 
ఐదేండ్ల ప్రాయంలోనే 
భాగవత పద్యాలను అలవోకగా చెప్పిన 
మహనీయులు  ఆదిభట్ల నారాయణ దాసు గారు .

పన్నెండవ ఏట ఒకటవ తరగతి లో ప్రవేశించి 
ఇంతితై వటుడింతై అన్నట్లు 
తెలుగు సంస్కృతం తమిళం హిందీ ఉర్దూ అరబ్బీ పారశీక భాషలలో
ప్రావీణ్యం సంపాదించి
నవరస తరంగిణి ,రామచంద్ర శతకం కాశీ శతకం 
మూడు వందలకు పైగా 
ఋగ్వేదము లోని ఋకులకు సంగీతం కూర్చి 
వీణానాదం చేసిన సంగీత సరస్వతి ..

సంగీత,సాహిత్య ప్రతిభతో ప్రజాదరణ పొంది లయబ్రహ్మ, పంచముఖి పరమేశ్వర అన్న పురస్కారాలను పొంది 
ఆనంద గజపతి చే ఆస్థాన విద్వాంసునిగా
విజయనగర సంగీత కళాశాల ప్రధానాధ్యాపకునిగా
ప్రముఖ వయోలిన్ విద్వాంసులు 
ద్వారం వెంకట స్వామినాయుడు సహఅధ్యాపకునిగా
ఎందరో సంగీత కళాకారులను తీర్చిదిద్దిన  కళా తపస్వి నారాయణ దాసు.

కవిత్వం, నాట్యం, సంగీతం అనే మూడు కళలను తన ప్రతిభతో జోడించి
హరికథ ప్రక్రియను సృష్టించి 
వేద నిలయమైన రాజమహేంద్ర వరంలో తొలి ప్రదర్శనతోనే 
కీర్తి గడించి 
మైసూరు మహారాజు చే ఘన సత్కారం 
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చే ప్రశంసలు పొంది 
ప్రతిభకు గుర్తింపుగా నోబెల్ బహుమతికి బ్రిటిష్ వారు పంపమని అడుగ 
తిరస్కరించిన మానధనుడు .

ఏవిషయం పైనైన అలవోకగా  హరికథ చెప్పే 
దాసుగారిని
ప్రేక్షకుడు హరికథ కాదు గిరికథ చెప్పమంటే
గిరిజా కల్యాణాన్ని రాగయుక్తంగా ఆలపించిన
అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు
మీకివే నా అక్షరాంజలులు...!!
............................

కామెంట్‌లు