కవిత్వం పండితే: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


చెట్లు పెరిగితే
పువ్వులు పూస్తాయి
సీతాకోకలు తాకితే
పిందెలు పుట్టకొస్తాయి

రోజులు గడిస్తే
కాయలు పెరుగుతాయి
ఎర్రగా పండితే
మాధుర్యాలు అందిస్తాయి

పెదవులు తెరిస్తే
తేనెచుక్కలు చిందుతాయి
కన్నులు తెరిస్తే
కాంతులు వెదజల్లుతాయి

కలము తెరిస్తే
అక్షరాలు పరుగెత్తుతాయి
గళము ఎత్తితే
రాగాలు వెలువడుతాయి

ఆలోచనలు పారితే
విషయాలు వెల్లడవుతాయి
భావాలు పొంగితే
వాణీదేవి కటాక్షిస్తుంది

అక్షరాలు అల్లితే
కుసుమాలు సరాలవుతాయి
గాలి వీస్తే
పరిమళాలు వ్యాపిస్తాయి

మోములు వికసిస్తే
చిరునవ్వులు చిందుతాయి

జాబిలి పొడిస్తే
వెన్నెలజల్లులు కురుస్తాయి  

అందాలు కనబడితే
ఆనందాలు చేకూరుతాయి
మనసులు పొంగిపోతే
కవనాలు బయటకొస్తాయి

కామెంట్‌లు