ఆకాశం ఆశీర్వదించి భూమికి దిగింది.
సముద్రం రుద్రరూపం తూర్పున కనిపిస్తుంది.
అలలు అల్లుకుని భూమిపై దొరుకుతున్నది.
నిటారుగా నిలబడ్డ చూపు ఎర్రబడింది.
నలుపెక్కిన దిక్కులు కాలిపోతున్నాయి.
విషం కక్కిన శరీరాలు నృత్యంతో మునిగి ఉన్నాయి.
సలసల కాగే రక్తంలో అమృతం చుక్కలు రాలుతున్నయి
ఊడిపడ్డ తలలు మెడల్లో దండాల్లా వేలాడుతున్నవీ
ఆఖరి శ్వాస ఆత్రంగా శరీరమంతా పాకింది
గిలగిలలాడే మొండెం లో కోట్ల నాలుకలు మొలుస్తున్నాయి.
సరిచేసిన స్వరం ముక్కలు ముక్కలుగా నరికి వేయబడి స్మశానంలో శంఖంపూరిస్తున్నది
మౌనంగా ధ్వనిస్తున్న ఆర్తనాదం మంటల్లో కాలిపోతుంది
ఏరీ దగ్గరికి చేర్చిన మాటలు అన్నీ గాల్లోకి విసిరే వేయ బడుతున్నవి.
కత్తులతో చీల్చిన శరీరం నెత్తురు త్రాగే తీగల్ని మొలిపిస్తున్నాయి.
గుడ్లగూబల సైన్యం ఊరి పొలిమేర్లలో ఉరుముతున్నాయి.
పిరికిపక్షులు ఎగిరిపోతున్నాయి.
రాబందులు నిదానంగా కిందికి దిగుతున్నాయి.
ప్రవహించే ఎండమావులు ఆవిరి రక్తంతో దాహం తీర్చుకుంటున్నాయి.
మొగలిపూల మధ్య నాగులు పొగలు కక్కుతున్నాయి.
విరిగిన నీరును కలుపుతూ మట్టి కొత్త అవతారం ఎత్తింది.
కళ్ళను మాలగా గుచ్చి రక్త మాంసాలతో యజ్ఞోపవితం తయారు చేస్తున్నారు.
పురాణాల స్మశానంలో మంత్రాల పూలమాలలు పేలిపోతున్నాయి..
ఎవరో ఎక్కుపెట్టిన బాణం అతడి ప్రాణం తీసింది.
మరో అవతారం కోసం లోకం ఎదురుచూస్తుంది.
-------------------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి