ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం శ్రామికా!: - బి.ఉషారాణి-Govt టీచర్మంచిర్యాల


ఎండనక వాననక నువ్వు
సేద్య క్షేత్రంలో చిందించే స్వేదమే
మా ఇంటికి ధాన్యమై చేరుతోంది శ్రామికా!

నీ చేతులు మన్నును మలిచి
వంటపాత్రలుగా తీర్చిదిద్దగా అవి
మా ఇంట ఆహారాన్ని వండుతున్నాయి శ్రామికా!

నీవు చెమట చుక్కలు చిందించి
కర్మాగారాలలో తయారుచేసిన వస్తువులే
మా జీవితాన్ని సులభతరం చేశాయి శ్రామికా!

బరువులెత్తి నీవు నిర్మించిన
ఆకాశహర్మ్యాలే మా నివాసాలై
మాకు రక్షణ ఇస్తున్నాయి శ్రామికా!

నీవు మండే ఎండలో నిలబడి
నిర్మించిన రహదారుల్లో
మా ప్రయాణం కొనసాగుతోంది శ్రామికా!

ఇంటి పనిమనుషులుగా
వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులుగా
నిత్యం మాకు మీరందిస్తున్న సేవలకు
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం?

నీ శ్రమకు గౌరవమిచ్చి తగిన వేతనాలు ఇచ్చి
నీ జీవికను మెరుగుచేయడం తప్ప
ఇంక నీకు మేమేం చేయగలం శ్రామికా!
కామెంట్‌లు