అనంతగిరిని భవిష్యత్ తరాలకు అందంగా అందించాలి: జిల్లా ఫారెస్ట్ అధికారి -విశాల్ బత్తుల IFS
 అనంతగిరిలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం


150 మంది విద్యార్థినులతో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన
వికారాబాద్, సెప్టెంబర్ 28: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతగిరిలోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి చెందిన సుమారు 150 మంది విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యాటక ప్రాధాన్యత, ప్రకృతి–పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, బాధ్యతాయుతమైన పర్యాటకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Friends of Snake Society ఆధ్వర్యంలో పాముల ప్రదర్శన నిర్వహించి, పాముల సంరక్షణ, పర్యావరణంలో వాటి ప్రాధాన్యత, పాముల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అనంతరం విద్యార్థినులను శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మూసీ నది పుట్టిన ప్రదేశం, అనంతగిరి ఎకో-అర్బన్ పార్క్, చెత్రి వ్యూ పాయింట్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో నేచర్ వాక్ నిర్వహించి అడవులు, జీవవైవిధ్యం, ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అటవీ అధికారి విశాల్ బత్తుల, IFS, ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి. నాగేశ్వర్ రావు, సోషల్ వర్కర్ KVM వెంకట్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
“బాధ్యతాయుతమైన పర్యాటకం – ఆరోగ్యకరమైన అడవులు – అభివృద్ధి చెందిన సమాజం” అనే సందేశంతో పర్యాటక ప్రాంతాలను పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులు తెలిపారు.
కామెంట్‌లు