మనసు నడిచిన దారులు: - వాకింగ్ కబుర్లు అనురాధ బొడ్ల (సముద్రాల) 9989566696

 

 ఏమిటివి? 
ఈ రోజుల్లో అందరికీ, వాకింగ్ అనేది తప్పనిసరి కార్యక్రమం అయిపోయింది. అయితే, నడిచే ఆ ఇరవయి ముప్పై నిమిషాలు, ఎవరి తోడూ లేకపోతే బోరు కొట్టేస్తూ ఉంటుంది. ఎవరయినా తోడు ఉన్నా కూడా, రోజూ మాట్లాడటానికి ఏముంటాయి? ఈ బోరు అనే ఒక చిన్న పదమో, పదార్ధమో వల్ల ఈ వాకింగులు వాయిదా వేస్తూ ఉంటాము. నేనూ ఆ కోవకి చెందిన దాన్నే.  ఎక్కువమంది ఫోనుని తోడు చేసుకుని నడుస్తూ ఉంటారు.  
అయితే, ఈ ఫోను తెచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయో, అనారోగ్యాలూ అన్నే కదా! మరి, బోరు కొట్టకుండా వాకింగ్ తో, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇంకేముంది చుట్టూ చూడటమే అనుకున్నాను. మా కమ్యునిటీలో రోజూ వాకింగ్ చేస్తూ, అలా చుట్టూ తిరిగే మనుషులను, కనపడే జంతువులను, ఆకర్షించే వస్తువులను, దృశ్యాలనూ చూస్తూ ఉంటే, మనసు ఖాళీగా ఉండదు కదా! అది ఎటో పరుగులు పెడుతుంది, వింత ఆలోచనలు రేపుతుంది, చిలిపి ప్రశ్నలు వేస్తుంది.
‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీ శ్రీ గారు చెప్పినట్టు, ఇక్కడ మీకు మనుషులతో పాటు, కుక్కలూ, పిల్లులూ, దోమలూ లాటి ఏ అంశమయినా కనపడొచ్చు. సామెతలూ ఎదురు కావచ్చు, రూల్ బోర్డులూ కనపడొచ్చు. చిలిపి ఆలోచనలతోపాటు జీవనసత్యాలూ దొర్లవచ్చు.  మనసుకు హద్దులు లేవు కదా! 
అలా వాకింగ్ సమయంలో, ఒక్కొక్క రోజు, చూసిన ఒక్కొక్క విషయం పై, నా మనసు చెప్పిన కబుర్లు, వేసిన ప్రశ్నలు, అన్నీ కలిపి, ఈ నా మనసు నడిచిన దారులు - వాకింగ్ కబుర్లు. 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice thought andi..better try to do a video or voice log.. Telugu ni mee galam lo vinatam inka bavuntundi ..!!