రెండు రోజులుగా సరిగ్గా వాకింగ్ టైం లో వర్షం కురవటం, ఆ తరువాత నేల తడిగా ఉందిలే అనే సాకుతో వాకింగ్ కి వెళ్ళటం మానేశాను. సరే, ఈ రోజు వర్షం లేదు అనుకుంటూ, ఉదయమే బాల్కనీ లోంచి తొంగి చూశా. కింద నేల అంత తడిగా లేదు. సరే ఈ రోజు వెళ్దాం వాకింగ్కి అనుకుని కిందికి వచ్చాను. స్కూళ్ళు మొదలయిపోయాయి కదా! వాకింగ్ చేసే జనాలతో పాటు, పిల్లలను స్కూల్కి పంపించే పేరెంట్స్, వాళ్ళతో నడుస్తున్న పిల్లలు వాతావరణం కాస్త సందడిగానే ఉంది.
అలా అందరినీ చూస్తూ మెల్లిగా నడుస్తున్నా. కొంత దూరం నడిచాక, అక్కడక్కడా ఫ్లోర్ పైన నీటి మడుగులు కనిపించాయి. రాత్రి కాస్త గట్టి వర్షమే పడినట్టుంది. నీరు ఎక్కువగా ఆగి ఉన్న దగ్గర, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు (వర్కర్స్) వైపర్స్ తోటి నీటిని తూములలోకి నెట్టుతూ ఉన్నారు. వాళ్ళకు ట్రెయినింగ్ ఇచ్చారో లేదా వాళ్ళ అనుభవమే వాళ్ళకి నేర్పిందో కానీ, చాలా రిథమిక్ గా ఒకరి తరువాత ఒకరు వైపర్స్ ఆడిస్తున్నారు. వర్షం పడినప్పుడల్లా భలే పని వీళ్ళకు అనుకుంటూ నడుస్తున్నాను.
ఒక దగ్గర ఒక అమ్మాయి అలా నీటిని నెట్టుతూ, గొణుగుతూ ఉంది. ఏంటే గొణుగుతున్నావు అని అడుగుతుంది మరొక అమ్మాయి. ఏంటక్కా ఈ పని? లాగి లాగి చేతులు నొప్పెడుతున్నయి. ఆ కట్టినోడెవడో సక్కగ కట్టొచ్చు కదా! వర్షం పడ్డప్పుడల్లా మనకీ కష్టం అంటోంది. ఊర్కోవే, సార్ వింటే మంచిగుండదు, అయినా పనికి దగ్గ డబ్బులూ ఇస్తారు కదే! పనుంటేనే మనకీ డబ్బులు, అంటోంది మరొక అమ్మాయి. ఆ...ఆ… ఇస్తరులే…! తప్పు ఎవడో చేస్తే చేతుల్నొప్పులు మనకి, అంటుంది మొదటమ్మాయి విసుగ్గా. నిజమేలేవే, కానీ పెద్దగా అరవకు, అని చెప్పింది మరో అమ్మాయి.
అది వింటూ అలా వెళ్ళిపోతూ ఉంటే నాకు నా చిన్నప్పుటి విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో ఇప్పటిలా తుడుచుకునే గచ్చులు కాదు కదా! వారానికో, నెలకో పండుగ, పబ్బాలకో మా అమ్మ, నానమ్మ, కలిసి ఇల్లు కడుక్కునేవాళ్ళు. ఆ కడిగిన నీళ్ళు తూముల్లోకి సరిగా వెళ్ళక నానా తిప్పలూ పడేవాళ్ళు ఇద్దరూ. అలా ఇల్లు కడిగినప్పుడల్లా ఆ నీళ్ళు నెట్టుతూ , మా ఇల్లు కట్టిన సుతారు నారాయణని తిట్టుకునేవాళ్ళు, ఆ తూము దాగ్గరికి సరిగ్గా స్లోప్ సరిగా పెట్టలేదని. ఇప్పుడు మా కిచెన్ ప్లాట్ఫాం స్లోప్ కూడా ఒక మూలకే ఉంటుంది, ఆ నొప్పి ఏంటో, నాకు రోజూ అనుభవమే.
ఆ విషయాలు గుర్తొచ్చి, నిజమే కదా, ఇల్లు కట్టేవాడు సరిగా కట్టకపోతే ఎల్లకాలం మనమే ఇబ్బంది పడాలి. ఇంత కమ్యుటీని, ఇంత ప్లాన్డ్ గా కట్టించిన వాళ్ళు ఈ ఫినిషింగ్ వర్క్స్ లో పట్టించుకోలేదు. ఇక్కడ తప్పు ఎవరిది? ఈ ఫ్లోరింగ్ చేసిన మేస్త్రిదా? ప్లానింగ్ చేసిన ఇంజనీరుదా? ఈ పనులన్నీ అజమాయిషీ చేసిన సూపర్వైజర్ దా? సర్లే అనూ, ఇప్పుడు తప్పెవరిదీ అని శోధిస్తావా ఏంటి? మ్...మ్...మ్.., శోధించలేనులే!, కానీ, తప్పెవరిదైనా, వీళ్ళంతా కష్టపడుతున్నారు పాపం అనుకుంటూ ముందుకి నడిచా.
మరొక మూల తిరిగాక, అక్కడ మరొక ముగ్గురమ్మాయిలు అదే పని చేస్తూ కనపడ్డారు. అయితే, వాళ్ళు మరొకరకంగా కనిపించారు. అటు పని చేసుకుంటూనే, ఒకరినొకరు ఫోటొలు తీసుకుంటూ, ముగ్గురూ కలిసి సెల్ఫీలు దిగుతూ నవ్వుకుంటున్నారు. ఇవ్వాళ ఎక్స్ ట్రా డబ్బులు దొరుకుతాయి కదా, మనమందరం సాయంత్రం సినిమాకి పోదామా? అంటుంది వారిలో ఒక అమ్మాయి.
నాకు నవ్వొచ్చింది. దృష్టిని బట్టి సృష్టి. సమయం ఒకటే. పనీ ఒకటే. కానీ, ప్రతిస్పందనే వేరుగా ఉంది కదా! వీళ్ళు డబ్బులు దొరుకుతాయని సంతోషంతో సినిమాకు వెళ్లే ప్లాన్లు వేసుకుంటూ ఉంటే, వాళ్ళు చేతులు నొప్పులని విసుక్కుంటున్నారు.
ఇప్పుడు ఆ ఎవరో చేసిన తప్పు మంచిదా, చెడ్డదా? ఒకరి తప్పు,.... మరొకరికి శిక్షా? బహుమానమా? మ్...మ్… ఒక్కోసారి తప్పూ మంచిదేనేమో మరి!
Varshapu neeru ni
Clearcheyatamu gurinchi chepputuuu
మనస్సు. గురించి జీవిత సత్యాన్ని చెప్పారు
నిజ్జమే
మన ఆలోచన లు బట్టి మన aanandhamu
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి