అద్వితీయం :-సుగుణ అల్లాణి- 9030057468
మొదటి సారి మొగ్గల్లాంటి నీ వేళ్లు 
నా మొరటు చేయిని తాకగానే 
నా మేను ఆనంద ఆర్ణవమైంది 
ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన 
నా చేతుల్లో ముద్దుల పసిపాప 
చిన్న చిన్న రింగులు తిరిగిన 
ఉంగరాల జుట్టు తో 
చిన్న లేత గులాబీ పువ్వు రేకులు 
బోర్లించి నట్టున్న కనురెప్పలు 
శంఖాల్లా ముడుచుకున్న తెల్లని పిడికిళ్లు 
సున్నాలా చుట్టిన చిట్టి పెదవులు 
రెండుకళ్ళు చాలవేమో అనుకుంటుంటే 
నా కళ్ళ నిండా ఆనందం కమ్మి 
నిన్ను కళ్లారా చూడలేక గుండెకు హత్తుకున్నా !!!


నా చీకటి కళ్ళకు మిణుగురులు 
దారి చూపించినట్లు 
ఆ వెలుగులో జీవితేచ్చ 
రెండితలైనట్లు అనిపించింది 
నా కూతురు నా ఆరో ప్రాణమైతే 
 నా ఆరు ప్రాణాలు నీవయ్యావు 

లాలి పాట పాడుతూ లాలపోస్తూ 
కమ్మని కబుర్ల తో కాటుక దిద్ది 
నిన్ను ఎత్తుకొని ముద్దుచేయడం లో 
నా రోజుమొదలయ్యేది.... ముగిసేది 
ఎప్పుడో మర్చిపోయిన నా పాటలు 
మళ్ళీ నా గొంతులో పురుడు పోసుకున్నాయి 
నా పాటలో కలిసిన నీ ముద్దుల పాట 
నేనూ పాడే ప్రతి పాట నీనోట వింటుంటే 
నా పసితనం కళ్ళముందు కదలాడేది 

అప్పుడే ఎనిమిదేళ్లు...
నిన్ను చూసిన ప్రతీ సారి 
నాకు ఆశ్చర్యమే...
నీకు తోడు నీ తమ్ముడు 
ఇద్దరూ కలిసి మా ప్రపంచానికి 
సూర్యచంద్రులయ్యారు 
మరొక లోకం లేకుండా 
మీతోడిదే లోకమయ్యేలా చేశారు.

అద్వైత్ అనే పేరుకు తగ్గట్లు 
నీకన్నీ మొదటి స్థానం లో ఉండాలి 
తల్లిదండ్రుల ఆశలకు వారధి కావలి 
నీవందరి ప్రేమ ను పొందాలి

కామెంట్‌లు
prasadklv చెప్పారు…
బాగుంది మీ రచన
అభినందనలు
మీకు..మీ మనవడికి.
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.56