మనుగడ మూలం – నేలతల్లి : - సయ్యద్ సల్మా- 7981914217-భద్రాచలం
నేలతల్లి గురించి వర్ణన
మనిషి తరమా?
ఖనిజాల లోతు కొలవగలిగినా
ఆమె గర్భంలోని కారుణ్యాన్ని
ఏ గణితం లెక్కపెట్టగలదు?
భూదేవి మీద జీవించే
సమస్త కోటి ప్రాణాల విలువను
ఏ మేధస్సు తూచగలదు?

చెట్లకు చాయగా,
పుట్టలకు నీడగా,
పాకలకు జీవంగా,
పక్షులకు గూడు అయి —
మౌనంగా నిలిచిన
ఆ తల్లి త్యాగానికి
ఏ కొలమానం సరిపోతుంది?

సమస్త జీవులకు
శ్వాస నేలతల్లే,
తనపై పుట్టిన జీవనానికి
తానే ఆశ్రయమై,
ఆహారంగా మారి,
జలంగా ప్రవహించి,
జీవితానికి దారి చూపే
అమోఘమైన మాతృమూర్తి ఆమె.

పచ్చిక బయళ్లుగా పరుచుకుని,
కొండలుగా ధైర్యంగా నిలిచి,
నదులుగా కరుణను మోసి,
సముద్రంగా ఓర్పును చల్లుతూ —
ప్రకృతి రూపంలో
తల్లి స్వరూపమే ఆమె.

మంటలు మండినా,
వరదలు ఉప్పొంగినా,
భూకంపాలు గుండెల్ని చీల్చినా,
తనను తాకిన గాయాలన్నీ
మౌనంగా భరించి —
మనిషిపై మాత్రం
ప్రతీకారం కోరని
అపారమైన శక్తి.

కానీ…
మనిషి ఏమి చేస్తున్నాడు?
తల్లి ఒడినే తవ్వుతున్నాడు,
ఆమె గుండెల్లో విషం నింపుతున్నాడు,
త్యాగాన్ని బలహీనతగా చూసి
లోభానికి బానిసవుతున్నాడు.

అడవులను నరికి
అభివృద్ధి అని పిలిచాడు,
ఆమె శ్వాసనే ఆపుతూ
జీవితాన్ని వెతుకుతున్నాడు.
తల్లిని నాశనం చేసి
భవిష్యత్తు కడతాననుకుంటున్నాడు —
ఇదేనా మానవ విజ్ఞానం?

ఇకనైనా మేలుకో మనిషీ!
తల్లిని గాయపరిస్తే
నీ రేపటిని నీవే
సమాధి చేస్తున్నావని తెలుసుకో.
నేలతల్లి క్షమిస్తుంది —
కాని ప్రకృతి తీర్పు
ఎవరినీ విడిచిపెట్టదు.

మట్టిని మరిచిన రోజు
మనిషి మనుగడ శూన్యం,
తల్లిని కాపాడిన నాడే
రేపటి జీవితం సజీవం.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
nice